క్రీడాకారులకు చాంపియన్స్‌ కిట్స్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు చాంపియన్స్‌ కిట్స్‌

Mar 10 2026 7:35 AM | Updated on Mar 10 2026 7:35 AM

కోచ్‌లకు ట్యాబ్‌ల పంపిణీ, కిట్లను పంపిణీ చేస్తున్న డిప్యూటీ సీఎం ఉదయనిధి, సత్యబ్రత సాహూ

– స్మార్ట్‌ వాచ్‌ల పంపిణీ

సాక్షి, చైన్నె: తమిళనాడు క్రీడాకారుల నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు విస్తృతం చేసింది. చైన్నెలోని కలైవానర్‌ రంగంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ క్రీడాకారులకు ఆధునిక పరికరాలు, డిజిటల్‌ ఉపకరణాలను పంపిణీ చేశారు. తమిళనాడు క్రీడా అభివద్ధి శాఖ హాస్టళ్లలో ఉంటూ శిక్షణ పొందుతున్న 2,600 మంది విద్యార్థులకు రూ. 71.15 లక్షల వ్యయంతో ఛాంపియనన్స్‌ కిట్‌లను అందజేశారు. ఇందులో బ్యాక్‌ప్యాక్‌, థర్మల్‌ వాటర్‌ బాటిల్‌, హాట్‌ – కోల్డ్‌ పౌచ్‌, అడ్జస్టబుల్‌ హ్యాండ్‌ గ్రిప్‌, థెరా బ్యాండ్‌, స్కిప్పింగ్‌ రోప్‌, తైల మర్దన రోలర్‌ , టోపీ వంటి అత్యవసర వస్తువులు ఉన్నాయి. అలాగే క్రీడాకారులు గాయాల బారి నుండి త్వరగా కోలుకోవడానికి రోజువారీ శిక్షణను ఉత్సాహంగా కొనసాగించడానికి ఇది తోడ్పడుతుందని ఉదయనిధి పేర్కొన్నారు.

టెక్నాలజీతో శిక్షణ: స్మార్ట్‌ వాచ్‌లు, ట్యాబ్‌లు

క్రీడా రంగంలో సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగంగా పలు డిజిటల్‌ పరికరాలను అందజేశారు. ఈ ఏడాది కొత్తగా చేరిన 950 మంది క్రీడాకారులకు రూ. 20.10 లక్షల విలువైన స్మార్ట్‌ వాచ్‌లను పంపిణీ చేశారు. వీటి ద్వారా వారి శారీరక శ్రమను నిరంతరం పర్యవేక్షించవచ్చు అని పేర్కొన్నారు. అథ్లెట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం కోసం 210 మంది కోచ్‌లకు మొబైల్‌ ట్యాబ్‌లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41 క్రీడా హాస్టళ్లకు ’ఆల్‌–ఇన్‌–వన్‌’ కంప్యూటర్లను మంజూరు చేశారు. క్రీడాకారుల శిక్షణ, ఆరోగ్యం, వైద్య పర్యవేక్షణ, ప్రదర్శన డేటాను ఒకే చోట చేర్చేందుకు ఈ డిజిటల్‌ వేదికను రూపొందించారు.కఠినమైన శిక్షణ సమయంలో క్రీడాకారుల కండరాల ఉపశమనం కోసం రూ. 39.59 లక్షల విలువైన అత్యాధునిక స్పోర్ట్స్‌ సైన్స్‌ పరికరాలను కూడా అందించారు. ఇందులో మసాజ్‌ గన్‌లు, కోల్డ్‌ కంప్రెషన్‌ థెరపీ సిస్టమ్స్‌ వంటి ఆధునిక యంత్రాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో క్రీడా అభివద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహూ, స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సభ్య కార్యదర్శి మేఘనాథ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement