‘దేవాంగ పిల్లి ’ సంరక్షణ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

‘దేవాంగ పిల్లి ’ సంరక్షణ కేంద్రం

Mar 10 2026 7:35 AM | Updated on Mar 10 2026 7:35 AM

– ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, చైన్నె : అంతరించిపోతున్న అరుదైన జీవజాతులను కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రధానంగా చెట్లపైనే తన జీవితాన్ని గడిపే అరుదైన క్షీరద జాతి దేవాంగ పిల్లి సంరక్షణ కోసం తొలి అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కరూర్‌, దిండిగల్‌ జిల్లాల సరిహద్దుల్లోని అయిలూరు ప్రాంతంలో సుమారు 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలోనే దేవాంగ పిల్లి కోసం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ప్రత్యేక కేంద్రం కావడం విశేషం.

సాంకేతికతతో పర్యవేక్షణ

ఈ అరుదైన జీవుల గురించి ప్రజలకు, పరిశోధకులకు అవగాహన కల్పించేందుకు తమిళనాడు అటవీ శాఖ సరికొత్త సాంకేతికతను జోడించింది: ప్రత్యేక వెబ్‌సైట్‌ – మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. దేవాంగుల జీవనశైలి, వాటి ఆహారపు అలవాట్లు, సంరక్షణ చర్యల గురించి తెలుసుకునే అవకాశం ఇటీ ద్వారా కల్పించారు. ఈ కేంద్రం కేవలం జంతు ప్రదర్శనశాలలా కాకుండా, అంతర్జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రంగా ఉంటుంది. విద్యార్థులు , శాస్త్రవేత్తలు దేవాంగ పిల్లిలో దాగి ఉన్న జీవన రహస్యాలను ఇక్కడ అధ్యయనం చేయవచ్చు. దేవాంగ పిల్లి వేటను అరికట్టడానికి , అభయారణ్యం రక్షణ కోసం ప్రత్యేకంగా బైక్‌ పోలీసులను రంగంలోకి దించారు. వీరు నిరంతరం అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తారు. దీనివల్ల సందర్శకులు , పరిశోధకులు నేరుగా క్షేత్రస్థాయి అధికారుల నుండి సమాచారాన్ని పొందే వీలుంటుంది. పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి నిపుణులు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రాబోయే తరాలకు ఈ వింతైన జీవిని పరిచయం చేయడమే కాకుండా, వాటి జాతిని అంతరించిపోకుండా కాపాడవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

దేవాంగ పిల్లి ప్రత్యేకత..

దేవాంగ పిల్లి ఎక్కువగా చెట్లపై నివసించే క్షీరదాలు. ఇవి తమ జీవితకాలమంతా దాదాపు చెట్ల పైనే గడుపుతాయి. ఇవి రాత్రివేళల్లో చురుగ్గా ఉంటూ కీటకాలు, ఇతర చిన్న జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. పర్యావరణ సమతుల్యతలో వీటి పాత్ర అత్యంత కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement