
పీఓకేను ఖాళీచేయండి
భారత్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విషయంలో తిరస్కరించే వైఖరిలోనే ఉండిపోవద్దని పాక్‌ను ఉద్దేశించి భారత్ వ్యాఖ్యానించింది.
పాక్‌కు భారత్ దీటైన జవాబు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విషయంలో తిరస్కరించే వైఖరిలోనే ఉండిపోవద్దని పాక్‌ను ఉద్దేశించి భారత్ వ్యాఖ్యానించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి పాకిస్తాన్ సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయాల్సిన అవసరముందని విదేశాంగ కార్యదర్శి జైశంకర్ పునరుద్ఘాటించారు. చర్చలకు రావాలంటూ పాక్ విదేశాంగ కార్యదర్శి అహ్మద్ చౌదరి ఇటీవల పంపిన ఆహ్వానానికి జైశంకర్ జవాబిచ్చారు.
పాక్ నుంచి కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదానికి, అది ప్రేరేపిస్తున్న హింసకు ముగింపు పలకటం ఎజెండాగా ఫలించే చర్చలు జరగాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ అంశాలపై ఇరువురికీ వీలైన సమయంలో ఎప్పుడైనా చర్చలకు తాను సిద్ధమని జైశంకర్ పాక్‌కు తెలియజేసినట్లు చెప్పారు. అదేసమయంలో.. ఉగ్రవాదాన్ని సమర్థించటం, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం అనేవి ఫలవంతమైన చర్చలకు ప్రాతిపదిక కాబోవని స్పష్టం చేసినట్లు వివరించారు.