పెనుగాలులు | Sakshi
Sakshi News home page

పెనుగాలులు

Published Tue, Dec 13 2016 4:26 AM

పెనుగాలులు - Sakshi

- తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ముందుకు దూసుకొచ్చిన సముద్రం
- చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం
- తిరుపతిలో జనజీవనం అస్తవ్యస్తం
- రేణిగుంట విమానాశ్రయంలో దెబ్బతిన్న పైకప్పు..
- వరదాయపాలెంలో అత్యధికంగా 35 సెం.మీ. వర్షం!
- చెన్నైకి వెళ్లే పలు విమాన సర్వీసులు, రైళ్లు రద్దు

 
సాక్షి నెట్‌వర్క్‌:  పెను తుపాను ‘వర్దా’దెబ్బకు  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. తుపాను తీరం దాటిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, పులికాట్‌ సరస్సు ప్రాంతాల్లో గంటలకు 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.  భారీ గాలులతో చెట్లు విరిగిపడిపోయాయి. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.  విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీ గాలులతో తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో కొంత భాగం పైకప్పు దెబ్బతింది. తిరుమల ఆలయంలోకి వర్షపు నీళ్లు చేరాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రెండుకార్లు ధ్వంసమయ్యాయి. 

తూర్పు గోదావరి జిల్లాలో అలల« ధాటికి కాకినాడ–ఉప్పాడ బీచ్‌ రోడ్డు నాలుగు కిలోమీటర్ల మేర ధ్వంసమైంది.  కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌ వద్ద వంద మీటర్లకు పైగా సముద్రం ముందుకు వచ్చింది.  పంటపొలాలు నీటమునిగాయి.      సోమవారం సాయంత్రం 5 గంటలకు చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో రికార్డు స్థాయిలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులు తెలిపారు. అయితే చుట్టుపక్కల ఎక్కడా ఇంత స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని, అందువల్ల ఈ డేటా కచ్చితమైనదో కాదో పరిశీలించాల్సి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో వర్షాల ధాటికి ఇద్దరు చనిపోయారు.

ముఖ్యమంత్రి సమీక్ష
తుపాను నేపథ్యంలో వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాయలసమీ, దక్షిణ కోస్తా జిల్లాల కలెక్టర్లతోనూ టెలికాన్ఫరెన్సులో మాట్లాడి పరిస్థితిని వాకబు చేశారు. కాగా,  వర్దా తుపానుతో అతలాకుతలమైన తమిళనాడు ప్రజలను ఆదుకునేందుకు తూర్పు నావికా దళానికి చెందిన శివాలిక్, కడ్‌మాట్‌ నౌకలు సోమవారం ఉదయం విశాఖ నుంచి బయలుదేరి వెళ్లాయి.  శ్రీహరి కోటకు సమీపంలో సముద్రంలో చిక్కుకున్న 18 మంది తమిళ జాలర్లను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది గమనించి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సూళ్లూరుపేట జాతీయ రహదారి మీద ఈదురు గాలుల ఉధృతికి క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి పడిపోయింది.   సోమవారం చెన్నై నుంచి విశాఖ, గన్నవరం విమానాశ్రయాలకు రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.    

పలు రైళ్లు రద్దు
వర్దా తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్లే పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రేణిగుంట మీదుగా మళ్లించారు. నెల్లూరు–సూళ్లూరుపేట, సూళ్లూరుపేట–చెన్నై డీఎంయూ పాసింజర్‌తో పాటు సర్కార్, సంఘమిత్ర, చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. గుంతకల్లు మీదుగా నడిచే చెన్నై–ముంబై ( 11042 ) రైలును రద్దు చేశారు. ముంబై–చెన్నై (నంబర్‌ 11027) ఎక్స్‌ప్రెస్, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్‌ రైలుతో పాటు చెన్నై వైపు వెళ్లే రైళ్లు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ రైల్వేస్టేషన్లలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement