పసిడి పరుగులు | Gold runs | Sakshi
Sakshi News home page

పసిడి పరుగులు

Apr 25 2014 1:59 AM | Updated on Sep 2 2017 6:28 AM

అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. వివిధ కారణాల వల్ల నగరానికి రోజూ రావాల్సిన బంగారం పరిమాణం గణనీయంగా పడిపోయింది.

  • అక్షయ తృతీయ ఎఫెక్ట్..
  •  ఆర్‌బీఐ నిబంధనలతో బెంగళూరుకు గణనీయంగా తగ్గిన సరఫరా
  •  వస్తున్న కొద్దిపాటి బంగారానికి డిమాండ్
  •  అమాంతం పెరిగిన ధరలు
  •  70 శాతం పడిపోయిన అమ్మకాలు
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. వివిధ కారణాల వల్ల నగరానికి రోజూ రావాల్సిన బంగారం పరిమాణం గణనీయంగా పడిపోయింది. సాధారణ రోజుల్లో 500 కిలోలు వస్తుండగా, ప్రస్తుతం వంద కిలోలకు మించడం లేదు. ఉన్నట్లుండి ధర పెరుగుతుండడంతో ప్రస్తుతం కొనుగోళ్లకు సైతం వినియోగదారులు విరామం ఇచ్చారు. ధరలు ఎప్పుడెప్పుడు దివి నుంచి భువికి దిగుతాయా అని ఎదురు చూస్తున్నారు.

    బంగారం ధర పెరుగుతుండడం వర్తకులకు సంతోషం కలిగిస్తున్నా, అమ్మకాలు సుమారు 70 శాతం వరకు పడిపోవడం వారిని కలవర పరుస్తోంది. గతంలో నగరంలో రోజుకు వెయ్యి కిలోల వరకు బంగారం అమ్ముడు పోయేది. ఆర్‌బీఐ నిబంధనల వల్ల నగరంలోకి బంగారం రాక గణనీయంగా పడిపోయింది.

    అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రాము ధర రూ.1,350 నుంచి రూ.1,283కు పడిపోగా, బెంగళూరులో దాని ధర రూ.2,835 నుంచి రూ.2,700కు ఎగబాకింది. డాలర్ ముందు రూపాయి పటిష్టం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో వ్యాపారులు తాము కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది.
     
    మే 2న అక్షయ తృతీయ
     
    అక్షయ తృతీయకు వినియోగదారులు బంగారు ఆభరణాలను ఎగబడి కొనుగోలు చేస్తారు. ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే సౌభాగ్యం చేకూరుతుందని పలువురి విశ్వాసం. ఈ సందర్భంలో వ్యాపారులు కూడా భారీ ఎత్తున డిస్కౌంట్లను ప్రకటిస్తుంటారు. ఈసారి అలాంటి ఆస్కారం ఉండబోదని వ్యాపారులు చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన ధర కంటే తక్కువకు అమ్మలేమని పేర్కొంటున్నారు. బంగారం సరఫరా తక్కువ కావడం, రూపాయి విలువ పెరగడం దీనికి కారణాలని వివరిస్తున్నారు.
     
    బ్యాంకులకు పండుగ

    బంగారానికి కొరత ఏర్పడిన ప్రస్తుత తరుణంలో కుదవలో ‘మునిగిపోయిన’ ఆభరణాలను పెద్ద మొత్తంలో లాభాలకు అమ్ముకోవడానికి బ్యాంకర్లు, ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఉత్సాహం చూపుతున్నారు. బ్యాంకులతో పాటు  ప్రైవేట్ వ్యక్తులు గ్రాముకు రూ.వంద చొప్పున అధికంగా విక్రయిస్తున్నారు. బంగారం సరఫరా బాగా తగ్గిపోవడంతో స్మగ్లర్లు కూడా విజృంభిస్తున్నారు. కోస్తా జిల్లాల నుంచి స్వల్ప పరిమాణాల్లో బంగారం భారీగా తరలి వస్తోంది.

    బంగారం దిగుమతులపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించడంతో స్మగ్లర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ప్రతి పది రోజులోకోసారి ఇంతే పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయాలి. నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇందులో ఏవైనా పొరపాట్లు దొర్లితే బంగారాన్ని దిగుమతి చేసుకోకూడదు...లాంటి ఆంక్షలు వర్తకుల చేతులు కట్టి పడేశాయి. దరిమిలా చిల్లర వర్తకులకు కావాల్సినంత బంగారం లభ్యం కావడం లేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement