గురుద్వారా పూజారి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం | Four jailed for life for killing gurdwara head priest | Sakshi
Sakshi News home page

గురుద్వారా పూజారి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం

Feb 28 2014 12:02 AM | Updated on Sep 2 2017 4:10 AM

ఆజాద్‌పూర్‌లోని గురుద్వారా ప్రధాన పూజారి హత్య కేసులో మహిళ సహా నలుగురికి ఢిల్లీ కోర్టు గురువారం యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.

 న్యూఢిల్లీ: ఆజాద్‌పూర్‌లోని గురుద్వారా ప్రధాన పూజారి హత్య కేసులో మహిళ సహా నలుగురికి ఢిల్లీ కోర్టు గురువారం యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. రాజధానితో సహా పలు నగరాల్లో ఉన్న గురుద్వారాలపై పట్టు కోసం జరుగుతున్న వివాదాల నేపథ్యంలో  నేరస్తులు ఈ హత్యకు ఒడిగట్టారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఆజాద్‌పూర్‌లోని ‘రబ్‌దా కుట్టా’ గురుద్వారాలో బాబా లఖ్‌బీర్ సింగ్ ప్రధాన పూజారి(మహంత్)గా నియమితులయ్యారు. తనను బలవంతంగా తప్పించి లఖ్‌బీర్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టారని ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జస్బీర్ కౌర్(42) అవమానంగా భావించింది. మృతుడు, నిందితురాలు ఇద్దరూ ‘బుద్ధా దళ్’లో రెండు వేర్వేరు వర్గాలకు చెందినవారు. దాంతో లఖ్‌బీర్‌ను ఎలాగైనా హత్యచేయాలని జస్బీర్ పథకం పన్నింది.
 
 ఆమెకు ఆమె కుమారుడు మల్కిత్ సింగ్(22)తో పాటు సుఖ్‌పాల్ సింగ్(28), రంజిత్ సింగ్(22) సహకరించారు. కాగా, లఖ్‌బీర్ సింగ్ కుటుంబం పంజాబ్ వెళ్లడంతో 2010 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో గురుద్వారాలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో నలుగురు నిందితులు గురుద్వారాలోకి ప్రవేశించి అతడికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని 24 గంటల పాటు గురుద్వారా స్టోర్‌రూంలోనే ఉంచారు. ఆ సమయంలో మృతదేహాన్ని తగలబెట్టడానికి సైతం వారు యత్నించారు. కాగా, మరుసటి రోజు రాత్రి నిందితులు మల్కిత్, సుఖ్‌పాల్, జస్బీర్ మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి తిమర్‌పూర్ సమీపంలోని కాలువలో విసిరేశారు. కేసు పూర్వాపరాలు విచారించిన అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కామిని నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement