అల్లకల్లోలం

Flood Water  In Karnataka Heavy Rains - Sakshi

కరావళి, మల్నాడులో   ఆగని కుండపోత  

మడికెరి వద్ద భవనం   కూలి ముగ్గురు మృతి  

కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ముంపు ముప్పు

సాక్షి బెంగళూరు: సుమారు పది రోజుల నుంచి కోస్తా, మల్నాడు జిల్లాలను భారీ వర్షపాతం కుదిపేస్తుండగా, గురువారం ప్రాణనష్టం కూడా సంభవించింది. కల్బుర్గి జిల్లాలో ముగ్గురు, కొడగు జిల్లాలో ముగ్గురు ఇళ్లు కూలి మరణించారు. ఇతర ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దక్షిణ కన్నడ, కొడగు జిల్లాల్లో వర్షం, నదులు ముంచెత్తడంతో పదుల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. సహాయక సిబ్బంది నిర్వాసితులను సురక్షిత ప్రాం తాలకు తరలిస్తున్నారు. కావేరి నదీ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. 

కూలిన ఇళ్లు, భవనాలు  
కొడగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం ఏడుగురు బలి అయ్యారు. కొడగులో మడికెరి వద్ద రెండంతస్తుల భవనం కొండచరియలు కూలి దొ ర్లిపడింది. ఈ ఘటనలో యశ్వంత్, వెంకటరమణ, పవన్‌ అనే ముగ్గురు గాయపడ్డారు. మడికెరె సమీపంలో ఒక గ్రామంలో కరెంటు షాక్‌తో మహిళ మృతి చెందింది. 

నిరాటంకంగా వర్షం  
మలెనాడు ప్రాంతంలోని శివమొగ్గ, కరావళి, దక్షిణ కన్నడ, దావణగెరె జిల్లాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈమేరకు జిల్లా అధికారులు ప్రమాదకర ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకుకురిసిన వర్షానికి ఉడుపి జిల్లాలో రూ.40 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. చిక్కమగళూరు జిల్లావ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. కుక్కె సుబ్రమణ్యలో కుమారధార నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉత్తర కర్ణాటకలో కృష్ణా నది ఆయుకట్టు ప్రదేశంలో భారీవర్షం కురిసింది. చిక్కోడి తాలూకాలో నాలుగు వంతెనలు పూర్తిగా నీట మునిగాయి. దావణగెరె జిల్లాలో సుమారు ఆరు ఇళ్లు కూలిపోయాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

దక్షిణ కన్నడ గజగజ  
మంగళూరు జిల్లా భంట్వాళలో గురువారం ఉదయం నుంచి గాలివాన బీభత్సం సృష్టించాయి. ఫలితంగా భంట్వాళలోని పల్లపు ప్రదేశాలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. తీరంలోని రోడ్లన్నీ నేత్రావతి నీటితో మునిగాయి. తాలూకాలోని పాఠశాలలకు తహసీల్దార్‌ పురందర హెగ్డే సెలవు ప్రకటించారు. బంట్వాళ, పాణెమంగళూరులో రోడ్లన్నీ మునిగి జనజీవనం అస్తవ్యస్తమైంది.  పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో స్థానిక పాణె మంగళూరులో ఉన్న శారదా పాఠశాలలో గంజి కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళూరు జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ సమీపంలో వెళ్తున్న రిక్షాపై చెట్టు పడింది. ఫలితంగా రిక్షా తొక్కుతున్న వ్యక్తి గాయపడ్డాడు. 

వర్ష బాధిత జిల్లాలకు రూ. 200 కోట్లు : అధికారులతో సమీక్షలో సీఎం కుమారస్వామి
సాక్షి బెంగళూరు: తీవ్ర వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కొడుగు, హాసన్, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాలకు రూ. 200 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. గురువారం రాష్ట్రంలో కురుస్తున్న తీవ్ర వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై వివిధ విభాగాల సీనియర్‌ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో కరావళి, మలేనాడు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు పర్యటించి రక్షణ చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శరణార్థులకు ఆహార ప్యాకెట్లను అందజేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కృష్ణబైరేగౌడ, ఆర్‌వీ దేశ్‌పాండే, యూటీ ఖాదర్, సారా మహేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top