రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. అధికారంలో ఉన్నా మెజారిటీ సీట్లు సాధించడంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చతికిల పడటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- ఫలితాల ప్రభావం
- పార్టీ లక్ష్యాన్ని అందుకోలేకపోయిన సిద్ధు ప్రభుత్వం
- వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సిద్ధు, పరమేశ్వర్
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. అధికారంలో ఉన్నా మెజారిటీ సీట్లు సాధించడంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చతికిల పడటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండంకెల సీట్లను కూడా కైవసం చేసుకోలేక పోయింది.
ఇందుకు గల కారణాలను అధిష్టానం ఎదుట వివ రించేందుకు సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను భేటీ అయినప్పుడు మంత్రి మండలి విస్తరణ విషయం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రి మండలిలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక మంత్రి ప్రకాశ్‌బాబన్న హుకేరి చిక్కోడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది.
అదే విధంగా కొందరు మంత్రుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో కొందరి శాఖలు మార్పుతో పాటు మరికొందరిని మంత్రిమండలి నుంచి తొలగించాలనే ఆలోచన కూడా అధిష్టానంకు ఉంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు సరిగా పనిచేయకపోవడం వల్లే ఆయా జిల్లాల్లో పార్టీ పార్లమెంటు అభ్యర్థులకు విజయం దక్కలేదనే సమాచారం కూడా అధిష్టానం సేకరించింది.
ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయం చేసి పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా సీఎం సిద్ధుతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు దిగ్విజయ్‌సింగ్ సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో సరిగా పనిచేయని మంత్రుల లిస్ట్‌లో వినయ్‌కుమార్ సూరకే, కిమ్మెన రత్నాకర్, శామనూరు శివశంకరప్ప, పరమేశ్వర్‌నాయక్, ఎం.బీ పాటిల్ ఉన్నట్లు సమాచారం.
రాష్ట్ర నాయకులు ఇచ్చే నివేదికను పరిశీలించిన తర్వాతనే మంత్రిమండలిలో మార్పులతో పాటు విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందన్న సీఎం సిద్ధు భరోసాపై ఆశలు పెంచుకున్న నాయకులు అమాత్య పదవి కోసం మరో మూడు మాసాలు ఎదురు చూడక తప్పదేమో. ఇక మంత్రి మండలి విస్తరణ చేసే సమయంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.