తమిళనాడు మేరీమాత ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది.
చెన్నై: తమిళనాడు మేరీమాత ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. తిరునల్వేలి జిల్లాలో విద్యుదాఘాతానికి గురై నలుగురు వ్యక్తులు మృతిచెందారు. దిశయన్‌విలై సమీపంలోని ఉబరి గ్రామంలో ప్రతి ఏడాది మేరీమాత ఆలయ ఉత్సవాలు వైభవంగా జరుపుతుంటారు. ఇందులో భాగంగా ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం సప్రం ఊరేగింపు జరిగింది. మేరీమాత విగ్రహాన్ని సప్రంలో అధిష్టించి ఊరేగింపుగా వెళ్లుతున్న క్రమంలో సప్రంకు విద్యుత్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది.
ఈ ప్రమాదంలో ఉబరి గ్రామానికి చెందిన రాజ(38), లిమాసన్(22), రాజ్(19), క్లైవ్ (23) అక్కడికక్కడే మృతిచెందగా మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్సవాల్లో నలుగురు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది.