తీహార్‌ జైలుకు దినకరన్‌.... | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైలుకు దినకరన్‌....

Published Mon, May 1 2017 6:53 PM

తీహార్‌ జైలుకు దినకరన్‌....

చెన్నై : రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన  కేసులో అరెస్టు చేసిన టీటీవీ దినకరన్‌ను జ్యుడీషియల్‌ కస్టడికి ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు  సోమవారం సాయంత్రం తీహార్‌ జైలుకు తరలించారు. అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

చెన్నైలో మూడు రోజల పాటుగా విచారణ కొనసాగించిన ఢిల్లీ క్రైమ్‌ పోలీసులు.... ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో  దినకరన్‌ను ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. అతడితో పాటుగా స్నేహితుడు మల్లికార్జున్‌ను పదిహేను రోజుల జ్యుడీషియల్‌ కస్టడికి న్యాయమూర్తి పూనం చౌదరి ఆదేశించారు. అయితే బెయిల్‌ కోసం దినకరన్‌ తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

కాగా దినకరన్‌ ఆరోగ్య విషయంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాదుల విజ్ఞప్తికి కోర్టు స్పందించింది. ఢిల్లీలోని ఆసుపత్రిలో దినకరన్, మల్లికార్జున్‌లకు జరిగిన వైద్య పరిశోధనల అనంతరం గట్టి భద్రత నడుమ తీహార్‌ జైలుకు తరలించారు. మరోవైపు దినకరన్‌కు చెందిన అయిదు బ్యాంక్‌ల్లోని ఖాతాల్ని ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే దినకరన్‌ రూ. 50 కోట్లు ఇసుక కాంట్రాక్టుల ద్వారా సమీకరించి పనిలో పడ్డట్టు విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గత నెల 25న దినకరన్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement