కొత్త కాంక్ష ! | dmk New slogans election manifesto | Sakshi
Sakshi News home page

కొత్త కాంక్ష !

Apr 28 2016 2:45 AM | Updated on Sep 5 2018 3:24 PM

ప్రజాహితాన్ని కాంక్షించే రీతిలో తమిళనాడు కాంగ్రెస్ సరికొత్త అంశాలతో మేనిఫెస్టోను రూపొందించింది. డీఎంకే సూచించిన కొన్ని అంశాల్ని క్రోడీకరించి,

సాక్షి, చెన్నై : ప్రజాహితాన్ని కాంక్షించే రీతిలో తమిళనాడు కాంగ్రెస్ సరికొత్త అంశాలతో మేనిఫెస్టోను రూపొందించింది. డీఎంకే సూచించిన కొన్ని అంశాల్ని క్రోడీకరించి, మరికొన్ని కొత్త నినాదాలతో ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం ప్రకటించారు. డీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కాంగ్రెస్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డీఎంకే మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతోంది. ఈ పరిస్థితుల్లో తమకంటూ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందించింది.
 
  కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ నేతృత్వంలో రూపొందించిన ప్రజాహిత మేనిఫెస్టోను ఉదయం సత్యమూర్తి భవన్‌లో విడుదల చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ మేనిఫెస్టో విడుదల చేయగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్, అధికార ప్రతినిధి కుష్బు, నేతలు కృష్ణస్వామి, తంగబాలు, కృష్ణమూర్తి, గోపన్న, రంగభాష్యం అందుకున్నారు. తదుపరి ఆ మేని ఫెస్టోలోని అంశాలను వివరించారు.
 
 మేనిఫెస్టోలో కొన్ని...
  రాష్ట్రంలో మళ్లీ పెద్దల సభ పునరుద్ధరణకు చర్యలు. ఇందులో హిజ్రాలు, అంధులకు ప్రాతినిథ్యం.
 లోకాయుక్తా ఏర్పాటుకు చర్యలు
 కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాగానే, తొలి సంతకంగా మద్యనిషేధం అమలు లక్ష్యంగా ఒత్తిడి
 మద్యం బానిసుల పునరావాసానికి మండలానికి ఒక కేంద్రం ఏర్పాటు. సారా తయారు చేస్తే కఠిన చర్యలకు చట్టాలు.
 బిందు సేద్యానికి వంద శాతం రాయితీ. కరువు, విపత్తులతో తల్లడిల్లుతున్న అన్నదాతలు జాతీయ, సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాల మాఫీకి చర్యలు
 సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తికి వంద శాతం రాయితీ.
 60 ఏళ్లు పైబడ్డ అన్నదాతలకు నెలకు రూ.రెండు వేలు పింఛన్.
 చెరువులు, కాలువలు, నదీ పరివాహక ప్రదేశాల్లో పూడికతీత. ఆ మట్టి పంట పొలాలకు ఉచితంగా తరలింపు
 ఫ్రీ కేజీ నుంచి పీజీ వరకు అందరికీ  ఉచిత విద్య లక్ష్యంగా చర్యలు. విద్యా వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక. జిల్లాకు ఒక నవోదయ స్కూల్ ఏర్పాటు
 విద్యుత్ ఉత్పత్తి పెంపునకు చర్యలు. అన్నదాతలకు  ఇచ్చే తరహాలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌కు చర్యలు. చేనేత ఉత్పత్తుల పెంపునకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు
 మహిళా రిజర్వేషన్ 33 నుంచి 50 శాతం పెంపునకు చర్యలు
 స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు
 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల రాయితీ కల్పనకు చర్యలు
 తమిళ జాలర్లకు నిషేధ కాలంలో రోజుకు రూ. 150 చొప్పున, 45 రోజులకు రూ. 6500 వర్తింపునకు ఒత్తిడి
 ఉప్పు ఉత్పత్తి కార్మికులకు వర్షా కాలంలో సహాయం.
 ప్రమాదాల్లో మరణించే కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. ఐదు లక్షలు పంపిణీకి చర్యలు
 ఉద్యోగ అవకాశాల్లో వికలాంగులకు మూడు శాతం కేటాయింపు. ఉద్యోగాలు లేని వికలాంగులకు నెలకు రూ.1,500 పింఛన్. వృద్ధాప్య పింఛన్ రూ.రెండు వేలకు పెంపు. ఉచిత బస్సు పయనం.
 హిజ్రాలకు రెండు శాతం కేటాయింపులు
 కూవం నది పునరుద్ధరణ. తిరుచ్చి,కోయంబత్తూరు, మదురై, సేలం నగరాలకు మెట్రో రైలు విస్తరణ.
 నడిగర్ తిలగం శివాజీ గణేషన్‌కు మణి మండపం. అక్టోబరు ఒకటి ఆయన జయంతిని కళాదినోత్సవంగా ప్రకటనకు చర్యలు. కోర్టు సూచనలతో మెరీనా తీరంలోని మహాత్మాగాంధీ, దివంగత కామరాజర్‌ల విగ్రాహలకు మధ్యలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు.
 నదుల అనుసంధానం తదితర అంశాలను తమ మేనిఫెస్టోలో ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement