అసెంబ్లీలో క్రమ‘శిక్ష’ణ..!


సాక్షి, ముంబై: శాసన సభ సమావేశాలు జరుగుతుండగా వివిధ కారణాలపై ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడం కొత్తేమీ కాదు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో గత ఐదు దశాబ్దాల కాలంలో ఇలా 40 సార్లు పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సస్పెన్షన్ వేటుకు బలయ్యారు. అసభ్యకర, అభ్యంతరకర పదజలాలు వాడడం, స్పీకర్ పోడియంలోకి బలవంతంగా చొచ్చుకుపోయి గందరగోళం సృష్టించడం, సభా కార్యకలాపాలు స్థంభింపజేయడం వంటి చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను స్వీకర్ సస్పెండ్ చేయడం పరిపాటే.సంయుక్త మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 43 మంది సభ్యులకు 1967 నవంబర్ 7,8 తేదీల్లో (రెండు రోజులు) సస్పెన్షన్‌కు గురయ్యారు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై చర్చించాలని పట్టుబట్టి గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సస్పెండ్ కావడం ఇదే ప్రథమం. ఆ తర్వాత ఈ స్థాయిలో సస్పెండ్ వేటు పడలేదు. మళ్లీ 2011 డిసెంబర్ 19న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన జితేంద్ర అవ్హాడ్, కాంగ్రెస్‌కు చెందిన నలుగురు సభ్యులను సస్పెండ్ చేశారు.సభ జరుగుతుండగా ప్ల కార్డులు చూపించడం, స్పీకర్ ఆదేశాలు పాటించనందుకు వీరిపై వేటు పడింది. అదేవిధంగా 2006 డిసెంబర్ ఐదో తేదీన రైతుల ఆత్మహత్యలపై సభాగృహంలో ప్లకార్డులు చూపించడమే కాక, శ వ యాత్ర నిర్వహించినందుకు దేవేంద్ర ఫడ్నవిస్, గిరీష్ మహాజన్ సహా 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను మూడు రోజుల కోసం సస్పెండ్ చేశారు. అనంతరం అదే నెల 13న స్పీకర్ పోడియంలోకి చొరబడి డిప్యూటీ స్పీకర్‌ను దుర్భాషలాడినందుకు ఏక్‌నాథ్ ఖడ్సే, సుధీర్ మునగంటివార్, గిరీష్ మహాజన్‌లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయాలనే ప్రతిపాదనను విధానసభ మంజూరు చేసింది. కాని మూడు నెలల తర్వాత ఆ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నారు.ఆ తర్వాత సహాయ మంత్రి ఏక్‌నాథ్ గైక్వాడ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 2001 మార్చి 27న సభాగృహంలో గందరగోళం సృష్టించించడంతోపాటు, సభ నియమాలు ఉల్లంఘించినందుకు దేవేంద్ర ఫడ్నవిస్, గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్‌లపై సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ వేటు వేశారు. 2009 జూన్ 16న శాసన సభ కార్యకలాపాలు జరుగుతుందగా స్పీకర్‌ను అవమానపరిచినందుకు బీజేపీకి చెందిన వినోద్ తావ్డే, శిసేనకు చెందిన దివాకర్ రావుతే, అరవింద్ సావంత్‌లపై రెండు రోజులపాటు సస్పెండ్ వేటు పడింది.తాజాగా ముఖ్యమంత్రి దేవేంద్రే ఫడ్నవిస్ నేతృత్వంలో నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు జరుగుతుండగా గందగోళం సృష్టించి సభ కార్యకలాపాలను అడ్డుకున్నందుకు ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్‌ను సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. ఇలా అనేక సందర్భాలలో ఎమ్మెల్యేలు, సభ్యులు సస్పెండైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top