పారదర్శకంగా ఎన్నికలు జరపడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన నమూనా పోలింగ్ కేంద్రాలకు ఢిల్లీ ఓటర్లు కితాబునిచ్చారు.
మోడల్ పోలింగ్ కేంద్రాలకు ఢిల్లీ వాసుల ప్రశంస
Dec 5 2013 11:48 PM | Updated on Aug 14 2018 4:32 PM
న్యూఢిల్లీ: పారదర్శకంగా ఎన్నికలు జరపడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన నమూనా పోలింగ్ కేంద్రాలకు ఢిల్లీ ఓటర్లు కితాబునిచ్చారు. మెరుగైన మౌలిక వనరులు, జనసమ్మర్థ నియంత్రణ, స్పష్టంగా కనిపించే సూచికలు, ప్రాథమిక చికిత్స వసతితో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఢిల్లీ ఓటర్లు మెచ్చుకున్నారు. తొలిసారిగా ఓటు వేసిన 19 ఏళ్ల రాధిక శర్మ ‘‘నేను ఓటు చేయడానికి వెళ్లిన పోలింగ్ స్టేషన్ పరిశుభ్రమైన వాతావరణంలో చక్కగా నిర్వహించారు’’ అని ప్రశంసించింది. హరినగర్‌లోని పోలింగ్ కేంద్రానికి రాధిక శర్మ తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది. ‘‘ఎన్నికల కమిషన్ ఇలాంటి వసతులను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి.
ఇలాంటి వాతావరణం కల్పిస్తే ఓటు వేయడానికి ముఖం చాటేస్తున్న వారు కూడా కదలివచ్చి ఓటు వేస్తారు’’ అని రాధిక అభిప్రాయపడింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తొమ్మిది ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. శాలీమార్‌బాగ్, సీమాపురి, లక్ష్మినగర్, చత్తర్‌పూర్, నజఫ్‌గఢ్, హరినగర్, రితాల, చాందీచౌక్‌లలో ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. లక్ష్మినగర్‌కు చెందిన సుమన్ కౌశిక్ మాట్లాడుతూ ‘‘గతసారి ఎన్నికల్లో నేను ఓటు చేయలేదు. ఈసారి వేయాలని కచ్చితంగా నిర్ణయం చేసుకున్నాను. అయితే దారులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. ఐతే ఈసారి ఎన్నికల కమిషన్ జాగ్రతలు తీసుకొని చక్కటి సూచికలను ఏర్పాటు చేసింది’’ అని వివరించారు.
బుధవారం జరిగిన ఎన్నికల్లో 65.86 శాతం పోలింగ్ నమోదయింది. బరిలో దిగిన 810 మంది అభ్యర్థుల్లో 70 మంది విజేతలుంటారు. ఈసారి పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు కమిషన్ ఈ రిక్షాలను ఏర్పాటు చేసింది. కేంద్రం ఉన్న చోటుకు సుల భంగా వెల్లేందుకు వీలుగా సూచికలను ఏర్పాటు చేసింది. దీని వలన ఓటింగ్ శాతం బాగా పెరిగింది.
ఎన్నికల కమిషన్ తెచ్చిన నూతన సంస్కరణలకు ఓటర్లు హర్షామోదాలు తెలిపారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ కూడా ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట రద్దీ లేదు. తోసుకోవడాలు, కుమ్ములాటలు లేవు. ఓటర్లు అసౌకర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఓటరు వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇంటర్నెట్ అనుసంధానంతో వెబ్ కెమెరాల ద్వారా నిర్వహణ పర్యవేక్షణ కూడా సమర్థవంతమైన నిర్వహణకు తోడ్పడింది’’ అని వివరించారు.
Advertisement
Advertisement