పలు అంశాలపై విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు సాక్షాత్తు రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెనె రత్నాకర్ జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారు.
బెంగళూరు : పలు అంశాలపై విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు సాక్షాత్తు రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెనె రత్నాకర్ జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారు. గురువారం నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లో నగరంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు చూపిన ప్రతిభ అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి మంత్రి కిమ్మెనె రత్నాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో చివరలో అభినందించేందుకు సమీపంలోకి వచ్చిన మంత్రిని విద్యార్థులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందలేదని తెలిపారు. కనీసం యూనిఫామ్‌లు కూడా ఇవ్వలేదని, ఇకపై సైకిళ్ల పంపిణీ విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంటే మంత్రిగా మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి తెల్లమొహం వేశారు. అనంతరం సమస్యలు రాతపూర్వకంగా ఇస్తే తప్పకుండా పరిష్కరిస్తానని అంటూ అక్కడి నుంచి జారుకున్నారు.