లోక్‌పాల్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 31వ తేదీ లోపు తమ ఆస్తులు, అప్పులు ప్రకటించనక్కర్లేదు.
న్యూఢిల్లీ: లోక్‌పాల్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 31వ తేదీ లోపు తమ ఆస్తులు, అప్పులు ప్రకటించనక్కర్లేదు. నూతన నిబంధనలు రూపొందిస్తున్నందున ఉద్యోగులు తమ ఆస్తులు, అప్పులు వెల్లడించనక్కర్లేదని మంగళవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎప్పుడు ఆస్తులు ప్రకటించాలో కేంద్రం స్పష్టంగా చెప్పలేదు.
లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 44 ప్రకారం డిసెంబర్ 31లోపు ఉద్యోగులు ఆస్తులు, అప్పులు ప్రకటించాలని ఈ ఏడాది జూన్‌లో సూచించింది. అలాగే 2015 మార్చి 31 నుంచి డిసెంబర్ 31 మధ్య తమ ఆస్తులపై వచ్చే వార్షిక ఆదాయం తెలపాలని కోరింది. అయితే నూతన నిబంధనల్ని నిర్ధారించే ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ప్రస్తుతం ఉద్యోగులు ఆస్తులు ప్రకటించనక్కర్లేదని కేంద్రం వెల్లడించింది.