దివాలా ప్రక్రియలో చిక్కుకున్న కంపెనీల ఆస్తులను రుణదాతలకు తిరిగి ఇవ్వడానికి వీలు కల్పించేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ను ఖరారు చేశాయి. దీనివల్ల వివిధ కేసుల్లో స్తంభింపచేసిన సుమారు రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఆస్తులను రుణదాతలకు అందించనున్నారు.
ఈ నిర్ణయం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జతచేయబడిన ఆస్తులను దివాలా పరిష్కార ప్రక్రియ (ఐబీసీ)లో ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు ఈ ఆస్తులు దివాలా ప్రక్రియలో అందుబాటులో లేకుండా పోవడంతో రికవరీకి అడ్డంకి ఏర్పడింది. ఇకపై పీఎంఎల్‌ఏలో అటాచ్ చేసిన ఆస్తులను సైతం ఐబీసీ ద్వారా రుణదాతలు రికవరీ చేసుకోవచ్చు.
ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ (IP) జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయడానికి ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ముందు ప్రామాణిక అండర్టేకింగ్ దాఖలు చేయవచ్చు.
నిబంధనల ప్రకారం ఆమోదించిన తర్వాత ఈ ఆస్తులు రుణదాతల (బ్యాంకులు, పెట్టుబడిదారులు) ప్రయోజనం కోసం తిరిగి ఇస్తారు.
నిందితులైన ప్రమోటర్లు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు ఈ ఆస్తుల నుంచి ఎటువంటి ప్రయోజనం పొందకుండా చూస్తారు.
ఆర్థిక నేరస్థులపై ప్రాసిక్యూషన్ను నిర్ధారిస్తూనే రుణదాతల ప్రయోజనాలను పరిరక్షించడం ఈ చర్య లక్ష్యమని ఈడీ నొక్కి చెప్పింది.
పరిష్కారాలు వేగవంతం
ఈ నిర్ణయం వల్ల దివాలా పరిష్కారాలు వేగవంతం అవుతాయని, పీఎంఎల్ఏ అటాచ్‌మెంట్ల కారణంగా గతంలో జరిగిన సుదీర్ఘ న్యాయ పోరాటాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ ఏఆర్‌సీఎస్ సీఈఓ హరి హరా మిశ్రా ఈ చర్యను సమయానుకూల పరిష్కారంగా చూస్తున్నట్లు చెప్పారు. ఇది ఐబీసీ ప్రక్రియ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: భారత ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాల్లో మార్పులు


