చివరిరోజు ఉద్రిక్తత

Buradala Polamma Temple High Tension Rayagada - Sakshi

రాయగడ : గ్రామదేవత ఉత్సవాల చివరి రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూజారులు, ఆలయ కమిటీ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. గత నెల 28 నుంచి ఈ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ముగింపు రోజైన బుధవారం.. రాయగడ పట్టణంలో 2వేల కుటుంబాలకు పైబడి ఘటాలు తీసుకురాగా, మజ్జిగౌరి అమ్మవారి ఘటం అంపకం ఉదయం 6గంటల సమయంలో నిర్వహించారు. 3 వేల మంది పైగా గ్రామప్రజలు పథిఘటాలతో భారీ ఉరేగింపు, బాణసంచా కాల్పులతో అంపక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. మజ్జిగౌరి ఘటాన్ని ఎజ్జిరాలు సుశీల తీసుకువెళ్లారు. తదుపరి గ్రామదేవత బురదలపోలమ్మ ఘటాన్ని ఉదయం 8 గంటల మధ్య అంపకం చేయాల్సి ఉంది. మజ్జిగౌరి ఘటన్ని తెల్లవారుజామున 4గంటలకు మందిరానికి చేర్చలేదనే కారణంతో పూజారులు, పూజా కమిటీ మధ్య వివాదం నెలకొంది.

ఇదే సమయంలో బురదలపోలమ్మ భక్తులను దృష్టిలో ఉంచుకోకుండా అమ్మవారి అంపకం మల్లేలు తొక్కే పూజను నిర్వహించేందుకు  పూజారులు ఇబ్బంది కలిగించడంతో వేరే పూజారిని కమిటీ తీసుకురావాల్సి వచ్చింది. ఈ సమయంలో మజ్జిగౌరి మందిర పూజారులు బురదలపోలమ్మ మందిరానికి వచ్చే ప్రయత్నంలో పూజా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సంతోష్, రమేష్‌ అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. 11 గంటల సమయంలో వేరే పూజారుల ద్వారా మల్లేలు తొక్కేందుకు పూజలు నిర్వహించారు. అనంతరం బురదలపోలమ్మ ఘటాన్ని బల్లమండ పూజారి వేరే ఎజ్జురాలితో ముందుగా ఊయలకంబాలా వేయించి తదుపరి అంజలిరథం వేయించి పిదప మల్లేలు తొక్కే కార్యక్రమం నిర్వహించారు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో 5వేల మంది భక్తులు ఘటాలతో వేచి ఉండడంతో చాలా మంది మహిళలు సృహతప్పి పడిపోయారు. పట్టణంలో అనేక సంస్థలు మజ్జిగ, రస్నా, పులిహోర, చల్లని నీటి పౌచ్‌లు, ఐస్‌క్రీమ్‌లు, గ్లూకోజ్‌ పానీయాలు, తాగునీరు అందజేశారు. అయినా భారీ సంఖ్యలో ప్రజలు సృహతప్పి పడిపొయారు. అమ్మవారి అంపకం ముందు రోజు రాత్రి ఊరుకట్టుట, రాజు, రాణితో విత్తనం పూజ వంటి కార్యక్రామలు రాత్రి 3గంటల వరకు నిర్వహించారు. ఒడిశాలో గంజాం అమ్మవారి పండుగ తర్వాత రాయగడ అమ్మవారి పండుగ అతి పెద్దది. పూజా కమిటీ ముందస్తుగా జిల్లా అధికారులు, పోలీసులకు తెలియజేసినప్పటికీ ఆఖరిరోజైన అమ్మవారి అంపకం సమయంలో కనీసం పోలీస్‌ బందోబస్తు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

దీంతో వందల సంఖ్యలో వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. ప్రధాన రహదారిలో 5 గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో అంపకానికి వచ్చే భక్తులు కార్లు, ఇష్టారాజ్యంగా రహదారిపైనే వదిలేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కనీసం ప్రజలు నడిచేందుకు కూడా దారి లేకుండా పోయింది. తెల్లవారు 4 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి అంపక కార్యక్రమాలు జరుపుకోగా.. మజ్జిగౌరి మందిర ప్రాంగణం, బురదలపోలమ్మ ప్రాంగణం, కోళ్లు, మేకలు, మొక్కుబడులు కారణంగా రక్తసిక్తం అయి కనిపించిది. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top