మహదేవప్పా...


 • బంగళా ఆధునీకరణకు రూ. 2 కోట్లు ఖర్చు

 •  ప్రజాధనం దుర్వినియోగం అంటూ విపక్షాలు మండిపాటు

 •  గోడలపై కార్టూన్ నెట్‌వర్క్ చిత్రాలు, చోటా భీమ్‌ను పోలిన బొమ్మలు

 •  ఎమ్మెల్యేల విదేశీ పర్యటనకు సన్నాహాలు

 •  నిత్య వివాదాల సుడిలో ప్రభుత్వం

 •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఓ మంత్రి ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు పెట్టి తన బంగళాకు రిపేర్లు చేసుకోవడం, రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు విదేశ పర్యటనలకు సిద్ధం కావడం లాంటి పరిణామాలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.  శాసన సభ హామీల కమిటీ అధ్యక్షుడు తన్వీర్ సేఠ్ నాయకత్వంలో సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు సన్నాహాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా బుధవారం లెజిస్లేచర్ హోంలో సమావేశం జరిగింది. ఈ విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కాగానే సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. మరో వైపు ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌సీ.  మహదేవప్ప తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళా రిపేర్లకు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. కుమార కృప వద్ద ఆయనకు కేటాయించిన బంగళా ఉంది. సాధారణంగా ప్రభుత్వ బంగళాల రిపేర్లను ప్రజా పనుల శాఖ చేపడుతుంది. ఏకంగా తానే ఆ శాఖ మంత్రి కనుక మహదేవప్ప ఇష్టానుసారం ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మొన్నటి వరకు ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన నివాసం ఇదే.  ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా సుమారు ఆరేడు నెలలు ఇందులోనే నివాసం ఉన్నారు. తర్వాత కావేరి బంగళాకు మారారు. బంగళాకు రిపేర్లు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, ఆర్భాటంగా ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోడలపై కార్టూన్ నెట్‌వర్క్ చిత్రాలు, చోటా భీమ్‌ను పోలిన బొమ్మలు లాంటివి చోటు చేసుకున్నాయి. ప్రజల సొమ్ముతో ఈ హంగులన్నీ కావాలా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top