పాముతో వీరోచితంగా పోరాడి..

Brave Dog Fights Cobra To save Owner, Dies Later - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్‌సెల్వి ప్లస్‌టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్‌ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్‌ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ శునకానికి అప్పు, ఆడ శునకానికి నిమ్మి అనే పేర్లు పెట్టి ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. ఈనెల 3న రాత్రి పొన్‌సెల్వి తన కుమార్తెలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, కుక్కలు రెండూ బయట ఉన్నాయి.

అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము వారింటివైపు రావడంతో రెండు కుక్కలు పెద్దగా మొరగడం ప్రారంభించాయి. మగ కుక్క అప్పు ఒక్క ఉదుటున పాముపై లంఘించి కరవడం ప్రారంభించింది. అలాగే పాము సైతం అప్పును అనేకసార్లు కాటువేసింది. అయినా అప్పు ఆ పామును వదలకుండా నోటకరుచుకుని కొరుకుతూనే బయటి మెట్లగుండా మిద్దెపైకి తీసుకుని వెళ్లి చంపేసింది. పాముకాటు విషం వల్ల కుక్క సైతం ప్రాణాలు విడిచింది. గురువారం తెల్లారిన తరువాత ఇంటి బయటకు వచ్చిన పొన్‌సెల్వికి ఆడ శునకం మాత్రమే కనపడడంతో అప్పుకోసం అంతటా గాలించింది. మిద్దెపైకి వెళ్లి చూడగా పాము, కుక్క చనిపోయి పడి ఉన్నాయి. పాము కాటు నుంచి తమ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలనే అర్పించిందని ఆమె కన్నీరుమున్నీరైంది. రెండింటినీ దూరంగా తీసుకెళ్లి గొయ్యితవ్వి పాతిపెట్టింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top