
మండిపాటు
విధులను సరిగా నిర్వహించడం లేదనే ఆరోపణలతో పాలికెలో అధికారులను సస్పెండ్ చేస్తున్న బీబీఎంపీ పాలనాధికారి
సస్పెన్షన్‌లపై భగ్గుమన్న బీబీఎంపీ ఉద్యోగులు
విధులు బహిష్కరించి ఆందోళన
బెంగళూరు: విధులను సరిగా నిర్వహించడం లేదనే ఆరోపణలతో పాలికెలో అధికారులను సస్పెండ్ చేస్తున్న బీబీఎంపీ పాలనాధికారి టి.ఎం.విజయ్‌భాస్కర్ వైఖరికి నిరసిస్తూ బీబీఎంపీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ విధులను బహిష్కరించి బీబీఎంపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీఎంపీ అధికారుల సంఘం ప్రతినిధి అమృతరాజ్ మాట్లాడుతూ....బీబీఎంపీ పాలనాధికారి టి.ఎం.విజయ్‌భాస్కర్ ఇప్పటి వరకు తొమ్మిది మంది అధికారులను సస్పెండ్ చేశారని అన్నారు. బీబీఎంపీలో అవసరమైన మేరకు సిబ్బంది లేరని, ఇప్పటికే వందల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయకపోయినా, తామంతా ఒత్తిళ్ల నడుమే పని చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.
ఇలాంటి సందర్భంలో ఉద్యోగులకు మరింత ప్రోత్సాహాలు కల్పించాల్సింది పోయి వారిని సస్పెండ్ చేస్తూ నైతికంగా కుంగుబాటుకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కొంతమంది సీనియర్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వారు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇదిలాగే కొనసాగితే తామెవరూ విధులు నిర్వర్తించే పరిస్థితే ఉండదని అన్నారు. ఇప్పటికైనా విజయ్‌భాస్కర్‌తో పాటు ఇతర అధికారులు తీరును మార్చుకోకపోతే మరింత భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ఉద్యోగులు హెచ్చరించారు.