బ్రెస్ట్ కేన్సర్ రాజధానిగా .... | Bangalore is India's breast cancer capital | Sakshi
Sakshi News home page

బ్రెస్ట్ కేన్సర్ రాజధానిగా ....

Apr 30 2016 8:24 AM | Updated on Sep 3 2017 11:07 PM

గార్డెన్ సిటీ, ఫ్యాషన్ సిటీ అంటూ ముద్దుగా పిలుచుకునే బెంగళూరు నగరం ప్రస్తుతం మరో పేరును కూడా తన జాబితాలో చేర్చేసుకుంది.

బెంగళూరులో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ కేన్సర్
దేశంలోని 11 ముఖ్య నగరాల్లో ఉద్యాననగరిదే మొదటి స్థానం
ప్రతి లక్షమందికి 36.6 బ్రెస్ట్ కేన్సర్ కేసులు
మారుతున్న జీవన విధానమే కారణమంటున్న వైద్యులు
 
బెంగళూరు: గార్డెన్ సిటీ, ఫ్యాషన్ సిటీ అంటూ ముద్దుగా పిలుచుకునే బెంగళూరు నగరం ప్రస్తుతం మరో పేరును కూడా తన జాబితాలో చేర్చేసుకుంది. అదే బ్రెస్ట్ కేన్సర్ రాజధాని. అవును బెంగళూరు నగరంలో బ్రెస్ట్ కేన్సర్ కూడా వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్  రీసర్చ్‌కు అనుబంధంగా నడుస్తున్న పాపులేషన్ బేస్డ్ కేన్సర్‌రిజిస్ట్రీ(పీబీసీఆర్) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. భారతదేశంలోని మొత్తం 11 ప్రముఖ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించగా మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది.
 
లక్ష మందికి 36.6బ్రెస్ట్ కేన్సర్ కేసులు
బెంగళూరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, తిరువనంతపురం, చెన్నై, నాగపూర్, కోల్‌కత్తా, కొల్లం, పూణె నగరాల్లో పీబీసీఆర్ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే  ప్రకారం బెంగళూరు నగరంలో ప్రతి లక్ష మంది జనాభాకు 36.6బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జాబితాలో 35.1బ్రెస్ట్ కేన్సర్ కేసులతో తిరువనంతపురం రెండో స్థానంలో ఉండగా, 32.6 కేసులతో చెన్నై మూడో స్థానంలో, 23.3 కేసులతో పూణె చివరి స్థానంలో ఉంది.
 
మారుతున్న ఆహారపు అలవాట్లతో ముప్పు...
పదేళ్ల క్రితం వరకు సాధారణంగా మహిళల్లో బ్రెస్ట్‌కేన్సర్ ప్రమాదం ఎక్కువగా 45-55 ఏళ్ల మధ్యన ఉండేది. మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం ఆ వయస్సు 35-45మధ్యకు తగ్గిపోయింది. ప్రపంచీకరణతో  బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో  మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానాలే ఇందుకు ప్రధాన కార ణాలుగా నిలుస్తున్నాయంటున్నారు వైద్యులు. ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు నగరంలో చాలా మంది కెరీర్ వేటలో పడి ఆహారపు నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
 
ఎక్కువగా జంక్‌ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకొని ఒబేసిటీకి గురై తద్వారా బ్రెస్ట్ కేన్సర్‌కు గురవుతున్నారు. ఇక పాశ్చాత్యీకరణ కారణంగా అమ్మాయిల్లో ధూమపానం, మద్యపానం అలవాట్లు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరులో ఇంతకుముందు కేవలం వీకెండ్ పార్టీలకు మాత్రమే పరిమితమైన ఈ అలవాటు ప్రస్తుతం చాలా మంది అమ్మాయిల్లో వ్యసనంగా మారిపోయింది. ఈ కారణంగా కూడా బ్రెస్ట్‌కేన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.
 
ఇవి కూడా కారణమే...

బ్రెస్ట్‌కేన్సర్ బాధితుల సంఖ్య పెరగడానికి ఆహారపు అలవాట్లే కాక జీవన విధానంలోని మార్పులూ కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు కెరీర్‌లో పూర్తిగా నిలదొక్కుకున్నాకే వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది నలభైల వయసు వరకు వివాహానికి దూరంగా ఉండడం కూడా బ్రెస్ట్ కేన్సర్ అధికమవడానికి ఒక కారణంగా నిలుస్తోంది.
 
గర్భధారణను వాయిదా వేయడం కోసం కాంట్రాసెప్టివ్ పిల్స్(గర్భనిరోధక మాత్రలు)ను ఇష్టమొచ్చినట్లుగా వాడడం, పిల్లలకు తల్లిపాలను (బ్రెస్ట్ ఫీడింగ్) అందించక పోవడం.. ఇవన్నీ కూడా బ్రెస్ట్ కేన్సర్ పెరగడానికి కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిబారిన పడుతున్న వారిలో పది శాతం వరకు వంశపారంపర్య (హెరిడిటరీ) సమస్య కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.
 
20 ఏళ్ల తర్వాత పరీక్షలు అవసరం...
పాశ్యాత్యీకరణ కారణంగా అమ్మాయిల ఆహారపు అలవాట్లు, జీవనవిధానాల్లో చాలా మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా జంక్‌ఫుడ్స్‌లో వాడే ప్రిజర్వేటివ్స్, గర్భధారణను వాయిదా వేయడం కోసం ఉపయోగిస్తున్న కాంట్రాసెప్టివ్ పిల్స్ మహిళల్లో బ్రెస్ కేన్సర్ బాధితుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి.

ఈ కారణంగానే ప్రస్తుతం బ్రెస్ట్ కేన్సర్‌ణు లైఫ్‌సై ్టల్ డిసీజ్‌గా పరిగణిస్తున్నాం. అందుకే  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలోనే కాంట్రాసెప్టివ్ పిల్స్‌ను వాడాలి. అంతేకాదు పిల్లలకు కచ్చితంగా తల్లిపాలనే అందించాలి. తద్వారా తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. 20 ఏళ్లు వయస్సు దాటిన మహిళలందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక వేళ బ్రెస్ట్ కేన్సర్ సోకినా తొలిదశలోనే నయం చేయడానికి అవకాశాలుంటాయి. 

- డాక్టర్ జయంతి,  ఆంకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement