
బెంగళూరు: లైంగిక దాడి కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. పని మనిషిపై అత్యాచార కేసులో బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శనివారం శిక్షను ఖరారు చేసింది. ప్రజ్వల్‌కు జీవిత ఖైదుతో పాటు రూ. 5 లక్షలు జరిమానాను కోర్టు విధించింది. అలాగే.. బాధితురాలికి రూ.7 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అత్యాచారం చేసి బెదిరించాడని గతేడాది మహిళ ఫిర్యాదు చేసింది. 26 మంది సాక్షులను విచారించిన కోర్టు తీర్పు వెల్లడించింది.
ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి రేవణ్ణ తనయుడు. 2019లో హసన్ నుంచి జేడీఎస్ తరఫున లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. కిందటి ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు వెలుగు చూసిన హసన్ సెక్స్ స్కాండల్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. 2021 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తన ఫామ్‌హౌజ్‌లో పని చేసే మహిళపై(48) మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ ఘాతుకాన్ని వీడియో తీసి ఆమెను బెదిరించాడన్నది ఈ కేసు.
ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్‌లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్‌లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్‌లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది.
పని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్‌పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్‌లోని ఫామ్‌హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.