
పల్లె నుంచి తెలుగు రాష్ట్రాలకు ఎదిగిన మెయిల్ సేవలు
నేడు డోకిపర్రులో ‘పింక్ పవర్ రన్‘
గుడ్లవల్లేరు: ఊరికి ఉపకారం చేయాలనుకునే వారి సేవలు పల్లె ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రుకు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా ఆ సంస్థ అధినేతలు పురిటిపాటి కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు.
అభివృద్ధితో పాటు ప్రజల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించటంలో భాగంగా మంగళవారం ‘పింక్ పవర్ రన్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డోకిపర్రులో మిస్ వరల్డ్ ఓపెల్ సుచాత చౌంగ్‌శ్రీ, మిస్ ఆసియా కష్ణ గ్రవిడెస్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కృష్ణారెడ్డి దంపతుల సేవలకు నిదర్శనం. గత ఏడాది హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ ‘పింక్ పవర్ రన్ జరిగింది.
గ్రామాభివృద్ధి..
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ(సీఎస్‌ఆర్) కింద ఈ సంస్థ తమ స్వగ్రామం డోకిపర్రును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తూ వస్తోంది. కృష్ణారెడ్డి, సుధారెడ్డి కుటుంబీకుల చేతుల మీదుగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. కొత్తగా గ్రామంలో తమ సొంత నిధులతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. ఇంటింటికీ సురక్షిత మంచినీటి ట్యాప్‌లను ఏర్పాటు చేసి గ్రామంలో ఆరు వేల మందికి రూ.4కోట్ల సొంత నిధులతో మంచినీటి పథకాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలోని 1,500 గృహాలకు గ్యాస్ ఇచ్చేందుకు 20 కిలోమీటర్ల మేరకు పైపులైన్ల నిర్మాణం చేపట్టారు.
ఒక్క వంట గ్యాస్ బండకు అయ్యే ఖర్చులో 40 శాతం ఖర్చు వినియోగదారునికి ఆదా అయ్యేవిధంగా ఈ గ్యాస్‌ను పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం దశావతారాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయటంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, సినీ హీరో చిరంజీవి, సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ మంత్రి కొడాలి నాని ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, క్షేమం కోసం ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని, అందులో భాగంగానే మంగళవారం పింక్ పవర్ రన్‌ను నిర్వహిస్తున్నట్టు కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు తెలిపారు.