మతోన్మాదంపై ఉద్యమిద్దాం
విశాలాంధ్ర పుస్తకాల ఆవిష్కరణ సభలో వక్తలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశంలో చోటు చేసుకున్న మతోన్మాద పరిస్థితులపై, ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న విచ్ఛిన్నకర ధోరణలపై ప్రజాస్వామ్యవాదులంతా కలిసి పని చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా బీవీ పట్టాభిరాం సాహిత్యవేదికపై విశాలాంధ్ర పుస్తకాల ఆవిష్కరణ సభ ఆదివారం జరిగింది. విశాలాంధ్ర సంస్థ బాధ్యుడు గడ్డం కోటేశ్వరరావు సంకలనం చేసిన ‘లౌకికత్వం– ప్రజాస్వామ్యంపై మతోన్మాదుల దాడి’, డాక్టర్ దేవరాజు మహారాజు రాసిన ‘హిందుత్వ సింహాసనంపై అబద్ధాల చక్రవర్తి’, ఏటుకూరి బలరామమూర్తి రాసిన ‘మనచరిత్ర’, వీపీహెచ్ సంకలనం చేసిన ‘చంద్రం వ్యాసావళి’ పుస్తకాలను ఆవిష్కరించారు. సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఈ పుస్తకాలను ఆవిష్కరించారు.
ప్రజలే మతోన్మాదంపై పోరాడాలి
సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమించటం ద్వారానే మతోన్మాదాన్ని జయించగలమని వామపక్షవాదులకు రచయిత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న సూచించారు. మతోన్మాదాన్ని జయించడం ఉపన్యాసాల వల్ల కాదన్నారు.
అహంకారంపై కవుల ధిక్కారం ‘జనకవనం’
బీవీ పట్టాభిరాం సాహిత్యవేదికపై నిర్వహించిన తొలి కార్యక్రమంలో కవులు తమ కవిత్వం ద్వారా ప్రపంచంపై దాష్టీకం చెలాయించాలని చూస్తున్న అమెరికా అహంకారంపై ధిక్కార స్వరాలు వినిపించారు. సాహి తీ స్రవంతి, మిత్ర సాహిత్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కవితా సదస్సుకు వొరప్రసాద్, తంగిరాల సోని ప్రయోక్తలుగా వ్యవహరించారు. సింగంపల్లి అశోక్ కుమార్, యింద్రవల్లి రమేష్, లెనిన్ ధనిశెట్టి, సత్యాజీ, గుండు నారాయణరావు, చలపాక ప్రకాష్, నేలపూరి రత్నాజీ, అజయ్ కుమార్ తదితరులు తమ సంక్షిప్త సందేశాలలో శ్రోతలను అలరించారు. మందరపు హైమవతి ప్రారంభ కవిత చదవగా, శిఖా– ఆకాష్, వైష్ణవిశ్రీ, అనిల్ డ్యాని, బంగర్రాజు కంఠ, డాక్టర్ జడా సుబ్బారావు తదితరులు తమ కవితాగానంతో అమెరికా దౌష్ట్యాన్ని ఖండించారు.
సునిశిత విమర్శ చేసే
‘మంచికంటి కథలు’
సామాన్యుల జీవితాల్లో వస్తున్న వివిధ పరిణామాలను సునిశితంగా గమనించి, వాటిలోని మంచి చెడులను సున్నితంగా పాఠకుల దృష్టికి తేవడంలో కథకుడిగా మంచికంటి విజయం సాధించారని సంపాదకులు నండూరి రాజగోపాల్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవం పదోరోజు ఆదివారం బీవీ పట్టాభిరాం సాహిత్యవేదికపై రెండో ‘అంబేడ్కర్ మనవాడు’ పేరుతో మంచికంటి రాసిన కథా సంకలనాన్ని శ్రీశ్రీ సంస్థ అధినేత విశ్వేశ్వరరావు ఆవిష్కరించారు. మరో గ్రంథాలయ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు కాట్రగడ్డ దయానంద్ అధ్యక్షత వహించారు. రచయిత మన్నం త్రిమూర్తులు తొలిప్రతిని స్వీకరించారు. నండూరి రాజగోపాల్ పుస్తకాన్ని సమీక్షించారు.
మతోన్మాదంపై ఉద్యమిద్దాం


