అసెంబ్లీ ఎన్నికలెప్పుడు...? | Arvind Kejriwal, AAP intensify demand for polls in Delhi | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికలెప్పుడు...?

Dec 20 2014 12:01 AM | Updated on Sep 2 2017 6:26 PM

డిసెంబర్ నెల దాదాపు ముగింపుకు వస్తుండగా, ఇంతవరకు అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించకపోవడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న తన డిమాండ్‌ను సామాజిక వెబ్‌సైట్లలో మరింత ఉధృతం చేసింది.

ఇంటర్నెట్‌లో పోరును ఉధృతం చేసిన ఆప్
న్యూఢిల్లీ: డిసెంబర్ నెల దాదాపు ముగింపుకు వస్తుండగా, ఇంతవరకు అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించకపోవడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న తన డిమాండ్‌ను సామాజిక వెబ్‌సైట్లలో మరింత ఉధృతం చేసింది. అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ నెల వరకూ వాయిదా వేయనున్నారని తమకు అనధికార వర్గాల ద్వారా తెలిసిందని పార్టీ ప్రతినిధి ఆతిషి మర్లీనా చెప్పారు. జమ్మూ- కశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలలో ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా లేకపోతే ఢిల్లీ ఎన్నికల తేదీని ఏప్రిల్ వరకూ వాయిదా వేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి మాసంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో కూడా జరగవచ్చని భావిస్తోంది. నవంబర్ చివరి వారంలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ అసెంబ్లీ రద్దు కావడంతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

అసెంబ్లీ రద్దయి కూడా నెల రోజులు గడుస్తోందని, కానీ ఎన్నికల తేదీని మాత్రం ప్రకటించడం లేదని ఆప్ నాయకుడొకరు విమర్శించారు. బీజేపీ కుయుక్తులు పన్ని ఏదో ఒక నెపంతో ఎన్నికలను వాయిదా వేసేందుకే ప్రయత్నిస్తోందన్న భావన తమకు కలుగుతోందని మరో నాయకుడు అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికల తేదీని ప్రకటించాలన్న తమ డిమాండ్‌పై చర్చను ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘ఢిల్లీ ఎన్నికలు ఏప్రిల్‌కు వాయిదా వేశారా? (ఎందుకు), బీజేపీ అంతగా భయపడుతోందా?’’ అని ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ గురువారం ట్వీటేశారు. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నుంచి వైదొలగిన నాటి నుంచే తాజా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement