అన్న భాగ్యకు బాలారిష్టాలు | Anna bhagyaku balaristalu | Sakshi
Sakshi News home page

అన్న భాగ్యకు బాలారిష్టాలు

Sep 3 2013 3:25 AM | Updated on Mar 18 2019 8:51 PM

రాష్ర్టంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు బాలారిష్టాలు.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు బాలారిష్టాలు తప్పేట్లు లేవు. తొలుత బియ్యం సేకరణ తలనొప్పి వ్యవహారంగా పరిణమించడంతో ప్రకటించిన సమయం కంటే రెండు నెలలు ఆలస్యంగా ఈ పథకం కింద పంపిణీని ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారి ఆహార అభిరుచులకు అనుగుణంగా బియ్యానికి ప్రత్యామ్నాయంగా జొన్న, రాగులను వచ్చే నెల రెండో తేదీ నుంచి పంపిణీ చేయాలనుకున్నారు.

అయితే ఈ ధాన్యాల సేకరణ  కూడా కష్టమవడంతో డిసెంబరులోగా కూడా ఈ పథకాన్ని చేపట్టడం అసాధ్యమనిపిస్తోంది. బియ్యం వద్దనుకునే వారికి రాగి లేదా జొన్నను పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. బీపీఎల్ కార్డుదారులకు గాంధీ జయంతి రోజు నుంచి వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సీజన్ కాకపోవడంతో ఈ ధాన్యాలను ఆహార, పౌర సరఫరాల శాఖ సేకరించలేక పోతోంది. నవంబరు తర్వాత మాత్రమే ఈ పంటల దిగుబడులు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.

కనుక డిసెంబరు నుంచి ఈ ధాన్యాల పంపిణీని ప్రారంభిస్తామని ఆ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. రాగిని 18 దక్షిణ కర్ణాటక జిల్లాల్లోని 34.28 లక్షల కుటుంబాలకు అందించాల్సి ఉంది. 13 ఉత్తర కర్ణాటక జిల్లాల్లోని 47.41 లక్షల కుటుంబాలకు జొన్నను ఇవ్వాల్సి ఉంది. మరో వైపు రాగి, జొన్న సేకరణ ఆర్థికంగా తలకు మించిన భారంగా తయారవుతోంది. ప్రస్తుతం కేజీ రాగి ధర రూ.30, జొన్న రూ.40 చొప్పున పలుకుతోంది. ప్రభుత్వం రవాణా ఖర్చులను కలుపుకొని కేజీ బియ్యాన్ని రూ.27 చొప్పున సేకరిస్తోంది. రాగి, జొన్నలపై ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశాలున్నందున, హైబ్రిడ్ రకం జొన్నను సేకరించాలనుకుంటోంది.

దీని ధర కేజీ రూ.19 మాత్రమే. అయితే ఉత్తర కర్ణాటకలో ఎక్కువ మంది హైబ్రిడ్ జొన్నను ఇష్టపడరు. కనుక దీనిపై సందిగ్ధత నెలకొంది. ఏదేమైనా రాగి, జొన్న పంపిణీ ప్రారంభమైతే పెద్ద మొత్తంలో బియ్యాన్ని సేకరించే భారం తగ్గుతుంది. ప్రస్తుతం నెలకు 2.77 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరిస్తుండగా, రాగి, జొన్న పంపిణీ ప్రారంభమైతే 70 వేల టన్నుల వరకు భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాగా రాగి, జొన్న సేకరణకు టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభమైందని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. స్పందన బలహీనంగా ఉంటే రేషన్ షాపుల ద్వారా వీటి పంపిణీ ఆలస్యం కావచ్చని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement