
డిసెంబరులోగా ‘అమ్మ’ థియేటర్లు
ముఖ్యమంత్రి జయలలితకు ప్రజలు ప్రేమతో పెట్టుకున్న పేరు ‘అమ్మ’. ఈ పేరుతో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ అముదం స్టోర్లు, అమ్మ
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి జయలలితకు ప్రజలు ప్రేమతో పెట్టుకున్న పేరు ‘అమ్మ’. ఈ పేరుతో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ అముదం స్టోర్లు, అమ్మ వాటర్ బాటిళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. నగరంలోని షాపింగ్ మాల్స్ సంప్రదాయం పెరిగిపోగా, అక్కడి వాణిజ్య సముదాయంలో నిర్మించిన సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధర పేదలకు అందుబాటులో లేదు. సగటుజీవి ఏకైక వినోద సాధనమైన సినిమాను నిరుపేదలకు సైతం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అన్నాడీఎంకే ప్రభుత్వం అమ్మ థియేటర్లను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించింది.
తొలిదశలో చెన్నై కార్పొరేషన్ పరిధిలో మండలానికి ఒకటి చొప్పున 15 మండలాల్లో థియేటర్ల నిర్మాణానికి 2014-15 బడ్జెట్‌లో పొందుపరిచారు. కార్పొరేషన్ స్వాధీనంలో నిరుపయోగంగా ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలను అమ్మ థియేటర్ల నిర్మాణానికి ఎంపిక చేశామని. ఇందుకు సంబంధించిన ప్రాథమిక పనులు చురుగ్గా సాగుతున్నాయని మేయర్ సైదై దొరస్వామి గురువారం ప్రకటించారు. ఏసీ వసతి, డిజిటల్ టెక్నాలజీతో కూడిన థియేటర్లను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. టికెట్టు ధర రూ.25లకు లోపునే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అమ్మ థియేటర్లలో ‘యు’ సర్టిఫికేట్ పొందిన చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. థియేటర్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలిచి ఈ ఏడాది డిసెంబరులోగా ప్రేక్షకులకు సినిమాలను అందుబాటులోకి తేనున్నట్లు మేయర్ తెలిపారు. నుంగంబాక్కం, రాయపురం, మింట్, అన్నానగర్, హార్బర్, మధురవాయల్, పెరుంగుడి తదితర 15 ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
‘అమ్మ’ పేరున మరిన్ని సేవలు ః
అమ్మ పేరున మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. మహిళా రైతుల శిక్షణ కోసం ‘అమ్మ ఫామ్’, నాణ్యమైన విత్తనాల సరఫరాకు ‘అమ్మ సీడ్స్’ ప్రవేశపెడుతున్నట్లు గురువారం నాటి అసెంబ్లీ సమావేశంలో సీఎం జయలలిత ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, మహిళా రైతులకు ప్రోత్సాహం కల్పించే విధంగా రూ.113 కోట్లతో అమ్మ ఫామ్‌లు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది 770 మహిళా స్వయం సహాయక రైతుల సంఘాలను ఏర్పాటు చేసి రుణాలను మంజూరు చేయనున్నారు. తమిళనాడు సీడ్స్‌లో ఉత్పత్తి పెంపు లక్ష్యంగా రూ.156కోట్లను ప్రకటించారు. అమ్మ సీడ్స్ పేరిట రైతులకు నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అమ్మ సేవా కేంద్రాలను ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆమె చెప్పారు. అలాగే 50 చోట్ల రూ.75కోట్లతో వ్యవసాయ కేంద్రాలు, 345 చోట్ల రూ.126కోట్లతో వ్యవసాయ పరికరాలు అద్దెకిచ్చే కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న అనాథ, వృద్ధుల శరణాలయాలకు ‘అమ్మ అన్బగం’ అనే పేరును ప్రతిపాదించినట్లు మంత్రి వలర్మతి గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. కొత్తగా 128 అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. వీటిల్లో ఏడు భవనాలను సంచారజాతులకు కేటాయించారు. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ ఁఅమ్మ అన్బగంరూ. పేరు పెట్టాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కోరుతున్నట్లుగా వలర్మతి తెలిపారు. పేరు మార్పుపై ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఆమె అన్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలు
హోసూరులో పోలీస్, రవాణా, రెవెన్యూ, అటవీ, వాణిజ్య, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి రూ.120 కోట్లతో కంబైన్డ్ చెక్‌పోస్టు నెలకొల్పుతున్నట్లు తెలిపారు. చెన్నైలోని వాణిజ్య పన్నుల కమిషనర్ కారాలయాన్ని రూ.6 కోట్లతో ఆధునీకరించనున్నట్లు చెప్పారు. పురాతన అద్దె భవనాల్లోని రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలకు పక్కా భవనాలను ప్రకటించారు. తిరుపూరు, సేలం, కంచి, చెన్నై, తంజావూరులలో 10 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలతో కూడిన ఐదు కంబైన్డ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, 25 వేర్వేరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయ భవనాలను నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. చెన్నైలోని 70 వాణిజ్య పన్నుల కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే విధంగా రూ.60 కోట్లతో రెండు భవనాలను నిర్మించనున్నారు.