వ్యవసాయ శాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తికి ఉద్వాసన పలికారు. సీఎం పన్నీరు సెల్వం సిఫారసుకు రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం రాత్రి
మంత్రి పదవి నుంచి కృష్ణమూర్తి తొలగింపు
వ్యవసాయ ఇంజనీరు ఆత్మహత్యే కారణమా?
సాక్షి, చెన్నై : వ్యవసాయ శాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తికి ఉద్వాసన పలికారు. సీఎం పన్నీరు సెల్వం సిఫారసుకు రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ కేబినెట్‌లో తరచూ మార్పులు చేర్పులు సహజం. ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా తక్షణం మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకడం సాధారణం. ఈతతంగం అంతా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎంగా ఉన్న సమయంలో సాగేది. అయితే, ఆమె అడుగుజాడల్లో సీఎం పన్నీరు సెల్వం ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. గత వారం రోజులకు పైగా వ్యవసాయశాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తిపై తీవ్ర ఆరోపణ మీడియాల్లో హల్‌చల్ చేస్తుండడం, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుండడంతో ఆయనకు పదవీ గండం తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి.
అయితే, అందుకు తగ్గ ఎలాంటి చర్యల్ని సీఎం పన్నీరు సెల్వం తీసుకోలేదు. రెండు రోజుల క్రితం పార్టీ పరంగా ఉన్న పదవిని అగ్రి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందన్నట్టుగా ప్రచారం బయలు దేరింది. వ్యవసాయ శాఖ ఇంజనీరు ఆత్మహత్యలో అగ్రి వ్యవహరించిన తీరే కారణమని తేలినట్టు సమాచారం. ఈ ఆత్మహత్యపై కాంగ్రెస్, పీఎంకేలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మంత్రి ఒత్తిడి తాళలేక ఆ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు గుప్పించారు. అలాగే, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ శనివారం ఈ వ్యవహారంపై స్పందించారు. మంత్రి తప్పు చేయనప్పుడు కేసును సీబీఐకు అప్పగించవచ్చుగా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో అగ్రి కృష్ణమూర్తికి ఉద్వాసన పలికే రీతిలో సీఎం పన్నీరు సెల్వం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్యకు సిఫారసు చేశారు. సీఎం సిఫారసుకు ఆమోద ముద్రను గవర్నర్ తెలియజేయడంతో అగ్రి పదవి ఊడింది. ఆయన వద్ద ఉన్న వ్యవసాయ శాఖతో పాటుగా మరికొన్ని శాఖల్ని సీనియర్ మంత్రి వైద్యలింగంకు అదనంగా అప్పగించారు. పార్టీ పదవి, మంత్రి పదవి ఊడిన దృష్ట్యా, ఆ అధికారి ఆత్మహత్య వెనుక అగ్రి హస్తం ఉందన్న ప్రచారం బయలు దేరింది. ఆయనపై కేసు న మోదు చేసి అరెస్టు చేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.