రూ.6.5 కోట్లతో హంపి ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

రూ.6.5 కోట్లతో హంపి ఉత్సవాలు

Published Wed, Dec 24 2014 1:20 AM

రూ.6.5 కోట్లతో  హంపి ఉత్సవాలు

9న ఉత్సవాలను ప్రారంభించనున్న సీఎం సిద్ధరామయ్య
వివిధ రాష్ట్రాల నుంచి కళాకారుల రాక

 
బళ్లారి : హంపి ఉత్సవాలను రూ.6.5 కోట్లతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సమీర్‌శుక్లా తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కన్నడ సాంస్కృతిక, పర్యాటక శాఖల నుంచి నిధులు విడుదల అవుతున్నట్లు తెలిపారు. వచ్చే నెల జనవరి 9న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హంపి ఉత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు పరమేశ్వరనాయక్, దేశ్‌పాండే, ఉమాశ్రీ, రోషన్‌బేగ్‌తో పాటు కేంద్ర మంత్రులు కూడా ఉత్సవాల్లో పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవ రాయ, ఎంపీ ప్రకాష్, విద్యారణ్య, దరోజీ ఈరమ్మ, హక్కబుక్క వేదికలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వీటిల్లో రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు.

విజయ నగర సామ్రాజ్య వైభవాన్ని ఉట్టి పడేలా సౌండ్ అండ్ లైట్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు నృత్య పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల నుంచి 60 మంది కళాకారులను పిలిపించనున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడలకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. హంపి ఉత్సవాల్లో గాలి పటాల ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని, ఆహార మేళాతో పాటు వివిధ రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హంపి ఉత్సవాలు చివరి రోజు పెద్ద ఎత్తున బాణసంచా పేలుడు కార్యక్రమాన్ని వినూత్న తరహాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు హైదరాబాద్‌కు చెందిన నిపుణులను రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లాధికారి వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement