
సర్కారుతో ఉద్యోగుల చర్చలు విఫలం
విరమణకు సీఎం సిద్దు వినతి
ప్రజలకు తప్పని ఇబ్బందులు
కర్ణాటక: ప్రజా రవాణాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు మంగళవారం బంద్ అయ్యే అవకాశముంది. పలు డిమాండ్లపై సర్కారుతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలించలేదు. ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు 38 నెలల వేతన బకాయిల చెల్లింపుతో పాటు అనేక డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. రవాణాశాఖ ఒక్కోట నాయకులు సీఎం సిద్దరామయ్య సోమవారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మంగళవారం నుంచి బస్సులు రోడ్ల పైకి వెళ్లవు. ఉదయం 6 నుంచి సమ్మె చేస్తామని రవాణా మండలి కార్మిక సంఘాల జాయింట్ క్రియా సమితి అధ్యక్షుడు అనంత సుబ్బారావ్ తెలిపారు.
14 నెలల బకాయిలిస్తాం: మంత్రి
ఉద్యోగులకు 14 నెలల వేతన బకాయిలను ఇవ్వడానికి సీఎం సమ్మతించారని రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. విధానసౌధ వద్ద విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడుతూ బకాయిల కింద రూ.718 కోట్లు చెల్లిస్తామని అన్నారు.
వాయిదాకు హైకోర్టు సూచన
రవాణా సమ్మెను ఒకరోజు వాయిదా వేయాలని హైకోర్టు న్యాయమూర్తులు కేఎస్.ముదగల్, ఎంజీఎస్.కమల్ ధర్మాసనం ఉద్యోగులకు సూచించింది. సమ్మె వల్ల జనజీవనం అస్తవ్యస్తమౌతుందని బెంగళూరువాసి జే.సునీల్ తదితరులు పిల్ వేశారు. విచారించిన జడ్జిలు ఒకరోజు వాయిదా వేయాలని సూచించారు.
రవాణా ఉద్యోగులు సెలవులు రద్దు
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రవాణా శాఖ ఉద్యోగులు సెలవుల రద్దుచేసింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా కట్టడి చేసింది. ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, వీలైతే వారం సెలవు కూడా రద్దుచేయాలని అధికారులను ఆదేశించింది. గైర్హాజరయ్యే ఉద్యోగులు వేతనాల్లో కోత విధించాలని ఆదేశించింది.
సమ్మె విరమించండి: సిద్దరామయ్య
ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో సీఎం సిద్దరామయ్య విధానసౌధలో సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్లను తీర్చడానికి గడువు ఇవ్వాలని, సమ్మె యోచనను విరమించాలని కోరారు. కానీ ఉద్యోగులు మాత్రం డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబట్టారు. సమ్మె వల్ల జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశముంది.