మాట వినలేదని ఓ బాలుడిని సవతి తల్లి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
చిన్నారిని చిత్రహింసలు పెట్టిన సవతి తల్లి
Oct 31 2016 11:37 AM | Updated on Sep 4 2017 6:48 PM
దర్శి: మాట వినలేదని ఓ బాలుడిని సవతి తల్లి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం శివరాజ్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. శివరాజ్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు బ్రహ్మయ్య(4)ను పెంచడం ఇష్టం లేని లక్ష్మి అతడిని తరచూ కొడుతూ వేధిస్తుండడంతో ఆంజనేయులు అతడిని హాస్టల్‌లో ఉంచాడు. బాలుడు ఇటీవలే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు.
భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా ఆ కోపాన్ని ఆమె బాలుడిపై చూపింది. మాట వినడంలేదంటూ బాలుడికి వాతలు పెట్టి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పైగా ఇంట్లో పెట్టి తాళం వేయడంతో బాలుడు రెండు రోజులుగా బయటకు రాలేదు. దీంతో గమనించిన స్థానికులు వారిపై ఒత్తిడి చేయడంతో అసలు విషయం తెలిసింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమందించారు. భార్యాభర్తలు ఇద్దరు పరారయ్యారు. పసివాడిని చిత్రహింసలు పెట్టిన తల్లిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement


