నగరంలో ప్రతి రోజు 20 మంది పిల్లలు మాయం | Sakshi
Sakshi News home page

నగరంలో ప్రతి రోజు 20 మంది పిల్లలు మాయం

Published Wed, Mar 25 2015 4:24 AM

20 children missing in Delhi every day

 సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిగా కీర్తి పొందుతున్న నగరంలో ప్రజలు, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైంది. మొన్నటిదాకా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో అప్రతిష్ట మూటకట్టుకున్న ఢిల్లీలో మరో కోణం బయటపడింది. నగరంలో ప్రతిరోజూ  సగటున 20 మంది పిల్లలు ఇంటి నుంచి మాయమవుతున్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు నెలలు ఇంకా పూర్తికాకముందే.. ఇప్పటికే 1,120 మంది పిల్లలు తప్పిపోయినట్లు పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తప్పిపోయిన వారిలో 621 మంది బాలికలుండటం గమనార్హం. గత సంవత్సరం 7,572 పిల్లలు తప్పిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వారిలో కూడా ఎక్కువ మంది ఆడపిల్లలే. నిరుడు ఇంటి నుంచి మాయమైన పిల్లల్లో 4,166 మంది బాలికలున్నారు. 2013లో 5,809 మంది, 2012లో 3,686 మంది పిల్లలు తప్పిపోయారు. పిల్లలు ఇంటి నుంచి మాయం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీసు అధ్యయనం తేల్చింది. కొందరు తమంతట తామే ఇంటి నుంచి పారిపోగా, మరికొందరు నేరగాళ్ల చేతికి చిక్కి తల్లిదండ్రులకు దూరమవుతున్నారని అధ్యయనం తెలిపింది.
 
 పిల్లల ఆచూకీ కోసం ఎంతగానో శ్రమిస్తున్న పోలీసులు
 ఇంత జరుగుతున్నా పిల్లలను ఎత్తుకుపోయే మూఠాలు, నేరగాళ్ల ఆచూకీ తీయడం పోలీసులకు శక్తికి మించిన పనిగానే ఉంది.తప్పిపోయిన పిల్లలను ఇంటికి చేర్చడం కోసం ఢిల్లీ పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. పిల్లల ఆచూకీ తీయడం కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్‌లో అధికారుల బృందం ఒకటి ఈ పనిపైనే ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే తప్పిపోయినవారిలో సగం మందిని మాత్రమే వారు ఇంటికి తిరిగి చేర్చగలుగుతున్నారు. త ప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలతో కలపడం కోసం పోలీసులు ఆపరేషన్ మిలాప్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
 
 పోలీసుల అధ్యయనంలో ఏముందంటే...
 మాయమైన పిల్లల్లో 11 శాతం మంది ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి పారిపోగా, కుటుంబ ఒతిళ్లు, ఘర్షణలను తట్టుకోలేక 10 శాతం పిల్లలు, ఇంటి దారి తెలియక  9 శాతం, స్నేహితుల బలవంతంతో 15శాతం మంది, పాఠశాల భయంతో 11శాతం, కుటుంబసభ్యులు తిట్టడంతో 8 శాతం మంది ఇంటి నుంచి పారిపోయారని, 36 శాతం మంది కిడ్నాప్, లైంగిక నేరాల వంటి ఇతర నేరాలకు పాల్పడేవారి చేతికి చిక్కి కనుమరుగుయ్యారని పోలీసు అధ్యయనం తెలిపింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement