ఈసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

ఈసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Published Fri, Aug 25 2017 12:57 PM

ఈసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాభదాయక పదవులు కలిగిఉన్నారంటూ 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగిస్తున్న ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆప్‌ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై బదులివ్వాలని జస్టిస్‌ ఇందర్మీత్‌ కౌర్‌ ఈసీని కోరారు. తమ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని, అవి చెల్లుబాటు కావని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున ఈ అంశంపై ఈసీ విచారణ కొనసాగించడం అవసరం లేదని ఆప్‌ ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.


ఈసీ ఉత్తర్వులు అన్యాయమని, పక్షపాతపూరితమని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే లాభదాయక పదవులపై ఈసీ తదుపరి విచారణ తేదీని ప్రకటించకపోవడంతో ఈ దశలో ఈసీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు స్టే కోరలేరని హైకోర్టు తెలిపింది. విచారణ తేదీని ఈసీ ప్రకటించిన పక్షంలో అప్పుడు దాన్ని నిలుపుదల చేసేందుకు పిటిషనర్లు అప్పీల్‌ చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. గతంలో జూన్‌ 23న ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎనిమిది మంది ఆప్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఈనెల 4న ఢిల్లీ హైకోర్టు ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. 

Advertisement
Advertisement