మళ్లీ బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ సింగ్‌

Yuvraj Singh Walks Off Despite Being Not Out - Sakshi

బ్రాంప్టన్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బరిలోకి దిగాడు. కెనడాలో జరుగుతున్న గ్లోబల్‌ టి20 టోర్నమెంట్‌లో టొరంటో నేషనల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వాంకోవర్‌ నైట్స్‌ టీమ్‌తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో యువీ నిరాశపరిచాడు. 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్‌ అయ్యాడు. అయితే రీప్లేలో అతడు నాటౌట్‌ అయినట్టు గుర్తించినా, అప్పటికే యువీ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. రిజ్వాన్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ ఆడిన బంతి అతడి బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి కీపర్‌ చేతుల్లోంచి వికెట్ల మీద పడింది. యువీ క్రీజ్‌లోనే ఉన్నట్టు రీప్లేలో కనబడింది. అయితే బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలిన బంతి వికెట్లను పడగొట్టిందన్న భావనతో యువీ మైదానాన్ని వీడినట్టుగా అనిపించింది.

ఈ మ్యాచ్‌లో యువీ టీమ్‌పై వాంకోవర్‌ నైట్స్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టొరంటో నేషనల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. వాల్టన్‌(59), హి వాండర్‌ డసేన్‌(65) అర్ధసెంచరీలతో రాణించడంతో వాంకోవర్‌ నైట్స్‌ సునాయంగా లక్ష్యాన్ని ఛేదించింది. 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికి మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో యువరాజ్‌ సింగ్‌ రాణిస్తాడని అతడి అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

యువీకి స్పెషల్‌ పర్మిషన్‌
బీసీసీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని గ్లోబల్‌ టి20లో యువీ ఆడుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు ‘పీటీఐ’తో చెప్పారు. ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి యువరాజ్‌ లేఖ రాసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు కాబట్టి అతడికి బోర్డు అనుమతి ఇచ్చినట్టు వివరించారు. యువీతో పాటు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, క్రిస్‌ గేల్‌, హెన్రీచ్‌ క్లాసన్‌ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు గ్లోబల్‌ టి20లో ఆడుతున్నారు. వాంకోవర్‌ నైట్స్‌ టీమ్‌ను గేల్‌ నాయకత్వం వహిస్తున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top