యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ

Yuvraj Singh Half Century In Vain - Sakshi

ఒంటారియో: గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ టీ20 లీగ్‌లో తనదైన శైలిలో స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ దూకుడు కొనసాగిస్తున్నాడు.  కెనడా లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరఫున ఆడుతున్న యువరాజ్‌.. బ్రాంప్టాన్‌ వాల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు.  22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. యువరాజ్‌ సింగ్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.

బ్రాంప్టాన్‌ వాల్స్వ్‌ నిర్దేశించిన 223 పరుగుల భారీ టార్టెట్‌ ఛేదనలో టోరంటో నేషనల్స్‌ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో యువరాజ్‌ సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు.  బౌండరీల మోత మోగిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు.  కాస్లెన్‌(35; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు)తో కలిసి స్కోరు బోర్డులో వేగం పెంచాడు. కాగా, నవాబ్‌ సింగ్‌ వేసిన 16వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టిన యువీ.. మూడో బంతికి క్యాచ్‌ పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత మెక్లీన్‌గన్‌(19 నాటౌట్‌; 3 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించినా టోరంటో నేషనల్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పయి 211 పరుగులు చేసి ఓటమి పాలైంది. అంతకుముందు విన్నీపెగ్‌ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45పరుగులు చేసిన యువీ.. ఎడ్మాంటన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top