మైదానంలో ‘మహరాజు’

Yuvraj Singh announces retirement from international cricket - Sakshi

సాక్షి క్రీడా విభాగం: 2000 సంవత్సరం... మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంతో మసకబారిన భారత క్రికెట్‌ ప్రతిష్టను మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సమయం. కొత్త మిలీనియంలో కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ కొందరు సీనియర్లతో పాటు యువరక్తం నిండిన ఆటగాళ్లతో కలిసి టీమిండియాకు నవ్య దిశ చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతనికి లభించిన ఒక మెరుపు యువరాజ్‌ సింగ్‌. కొన్నాళ్ల క్రితమే జరిగిన అండర్‌–19 ప్రపంచకప్‌లో చెలరేగి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన ఆ కుర్రాడిని భారత సెలక్టర్లు ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేశారు.

తన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ అవకాశం రాని యువీ... పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన తర్వాతి పోరులో 80 బంతుల్లోనే 84 పరుగులతో జట్టును గెలిపించి తన రాకను ఘనంగా చాటాడు. అది మొదలు తర్వాతి 17 ఏళ్ల పాటు యువరాజ్‌ బ్యాట్‌ గర్జించింది. వన్డేల్లో అనేకానేక అద్భుతాలు చేయడమే కాదు... అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటున్న టి20 క్రికెట్‌లో కూడా బలమైన ముద్ర వేసింది. ఒకటా...రెండా... భారత జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో  యువీ పోషించిన పాత్ర అసమానం.  

భారత్‌ తరఫున ఒకే ఒక టెస్టు ఆడిన తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ తాను సాధించని ఘనతను కొడుకు ద్వారా అందుకోవాలని కల కన్నాడు. అందుకే జాతీయ స్థాయి రోలర్‌ స్కేటింగ్‌లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత యువీ అందుకున్న పతకాన్ని బయటకు విసిరేసి క్రికెట్‌ మాత్రమే ఆడాలని హెచ్చరించాడు. నాడు తండ్రి ఆంతర్యం సరిగా అర్థం చేసుకోలేకపోయినా తర్వాత ఆటపై పెంచుకున్న మమకారం అతడితో చిన్న వయసు నుంచే అద్భుతాలు చేయించింది. అండర్‌–15 నుంచి ఏ వయసులో ఆడినా పరుగుల వరద పారించడం అలవాటుగా మారిపోయింది. బిహార్‌తో జరిగిన అండర్‌–19 కూచ్‌బెహర్‌ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్‌ తరఫున చెలరేగి చేసిన 358 పరుగుల ఇన్నింగ్స్‌తో యువరాజ్‌ పేరు దేశవాళీ క్రికెట్‌లో మారుమోగిపోయింది. ఆ తర్వాత యువీ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

తారాజువ్వలా....
టీమిండియాకు ఎంపికైన తర్వాత కొంత కాలం తన ముద్ర చూపిన యువీ రెండేళ్ల తర్వాత వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే పునరాగమనం తర్వాత 2002 నాట్‌వెస్ట్‌ టోర్నీ అతని కెరీర్‌ను తారాజువ్వలా పైకి లేపింది. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌కు తోడుగా అర్ధసెంచరీ చేసిన అతను... తన 71వ వన్డేలో గానీ మొదటి సెంచరీ సాధించలేకపోయాడు. 2004లో సిడ్నీ మైదానంలో ఆసీస్‌పై చెలరేగి 122 బంతుల్లో చేసిన 139 పరుగుల ఇన్నింగ్స్‌ అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనల్లో ఒకటి. ఇక 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌లో యువీ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ ఓవర్లో ఆరు సిక్సర్లే కాదు... ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో 30 బంతుల్లో చేసిన 70 పరుగుల ఇన్నింగ్స్‌ అతని విలువేమిటో చూపించింది. 2010లో ఫామ్‌ కోల్పోవడం, క్రమశిక్షణ లోపం, ఫిట్‌నెస్‌ సమస్యలతో మళ్లీ అతనిపై వేటు పడినా... తక్కువ వ్యవధిలోనే తిరిగొచ్చాడు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ప్రదర్శన యువరాజ్‌ కెరీర్‌లో కోహినూర్‌ వజ్రంగా నిలిచిపోయింది. బ్యాటింగ్‌కు తోడు అతని లెఫ్టార్మ్‌ స్పిన్‌ కూడా భారత్‌కు కీలక సమయాల్లో విజయాలు అందించింది.  

క్యాన్సర్‌తో పోరాడి...
ప్రపంచ కప్‌ గెలిచిన కొన్నాళ్లకే యువరాజ్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు బయటపడింది. జీవితంలో అతి పెద్ద పోరాటంగా భావిస్తూ చికిత్స పొంది కోలుకున్న అనంతరం యువీ మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగు పెట్టడం ఒక అద్భుతం. అయితే కెరీర్‌లో ఉచ్ఛ స్థితిలో ఉన్న సమయంలో వచ్చిన క్యాన్సర్‌ తర్వాత అతని ఆట అంత గొప్పగా సాగలేదు. పోరాటానికి మారుపేరుగా నిలిచిన యువీ పలు మార్లు జట్టులోకి రావడం, పోవడం తరచుగా జరిగాయి. వన్డేల్లో ఇంగ్లండ్‌పై చేసిన 150 పరుగుల తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు,  టి20ల్లో ఆస్ట్రేలియాపై 35 బంతుల్లోనే 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు రాలేదు. ఆ తర్వాత దేశవాళీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త క్రికెటర్ల రాకతో అతను మెల్లగా భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యువీ రాజసం ఎప్పటికీ చెక్కుచెదరనిది అనడంలో సందేహమే లేదు.  

మధుర జ్ఞాపకాలు...
7 అక్టోబర్, 2000 (నైరోబీ):  ఆసీస్‌తో చాంపియన్స్‌ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌. యువీ తొలి ఇన్నింగ్స్‌ ఇదే. 80 బంతుల్లో 12 ఫోర్లతో 84 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. యువీ రాక ప్రపంచానికి తెలిసింది. భారత్‌ ఈ మ్యాచ్‌లో 20 పరుగులతో నెగ్గింది. 

13 జూలై, 2002 (లార్డ్స్‌): ఇంగ్లండ్‌పై నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో అసాధ్యమైన 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కైఫ్‌ (87 నాటౌట్‌)తో కలిసి యువీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ ఇది. వీరిద్దరి 121 పరుగుల భాగస్వామ్యంతో సాధించిన ఘన విజయం భారత వన్డే క్రికెట్‌ రాతను మార్చింది. యువీ 63 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు చేశాడు.
 

22 జనవరి, 2004 (సిడ్నీ): ఆస్ట్రేలియాపై 122 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో చేసిన 139 పరుగులు చేసిన యువరాజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌ ఆసీస్‌ గెలిచింది.  

19 ఫిబ్రవరి, 2006 (కరాచీ): పాకిస్తాన్‌ గడ్డపై 4–1తో వన్డే సిరీస్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. ఆఖరి వన్డేలో 93 బంతుల్లోనే 14 ఫోర్లతో 107 పరుగులు చేయడంతో భారత్‌ 8 వికెట్లతో గెలిచింది.  
 
19 జనవరి, 2017 (కటక్‌): పునరాగమనం తర్వాత యువీ చేసిన అద్భుత శతకం ఇది. ఇంగ్లండ్‌పై 127 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగి 150 పరుగులతో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు.  

6 6 6 6 6 6  
యువరాజ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచానికి గుర్తుకొచ్చే మ్యాచ్‌ ఇది. 2007 తొలి టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో యువరాజ్‌ చూపించిన విశ్వరూపం ఇది. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ కొత్త చరిత్ర సృష్టించాడు. టి20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే అతను చేసిన ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.  

కొరుకుడు పడని టెస్టు క్రికెట్‌...

వన్డేలు, టి20ల్లో అద్భుతాలు చేసినా యువరాజ్‌ వేర్వేరు కారణాలతో ఏనాడూ మంచి టెస్టు బ్యాట్స్‌మన్‌ కాలేకపోయాడు. అతని కెరీర్‌లో ఉన్న మూడు సెంచరీలు కూడా పాక్‌పై సాధించినవే కావడం విశేషం. లాహోర్‌ లో కఠిన పరిస్థితుల్లో చేసిన 129 పరుగులు, కరాచీలో ఓటమి ఖాయమైన టెస్టులో 122 పరుగులు చేసిన యువీ... బెంగళూరులో భారత్‌ స్కోరు 61/4గా ఉన్నప్పుడు చేసిన 169 పరుగులు అతని మూడో శతకం. సెంచరీ కాకపోయినా... ఇంగ్లండ్‌పై 2008 చెన్నై టెస్టులో సచిన్‌కు సహకారం అందిస్తూ చేసిన (85 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ కూడా ఎప్పటికీ మరచిపోలేనిది.

అద్భుతమైన కెరీర్‌ నీది. మైదానంలోనూ, బయటా కష్టకాలంలో నువ్వు చూపిన పోరాటం అభినందనీయం. జట్టుకు అవసరమైన ప్రతీసారి చాంపియన్‌లా తిరిగొచ్చావు.
  –సచిన్‌  

గొప్ప కెరీర్‌ ముగించిన నీకు అభినందనలు. మాకు ఎన్నో విజయాలు, జ్ఞాపకాలు అందించావు.
–కోహ్లి

ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు కానీ యువీలాంటి వాళ్లు అరుదు. అటు బౌలర్లను, ఇటు క్యాన్సర్‌ను చితక్కొట్టి మనసులు గెలుచుకున్న అతను ఎందరికో స్ఫూర్తిదాయకం. 
–సెహ్వాగ్‌
ప్రిన్స్‌కు అభినందనలు. భారత్‌ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నువ్వే అత్యుత్తమం. నేనూ నీలాగా బ్యాటింగ్‌ చేయగలిగితే బాగుండేది. బీసీసీఐ ఇకపై 12 నంబర్‌ జెర్సీకి రిటైర్మెంట్‌ ప్రకటించాలి. 

–గంభీర్‌
నా యుద్ధ వీరుడు. ఆటలో, జీవితంలో ఎంతో పోరాడాడు. నీ గురించి అంతా ఎప్పటికీ చెప్పుకుంటారు.
–హర్భజన్‌  

నీతో ఆడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ముగిస్తున్నావు. నీ పట్టుదల, పోరాటంతో మాకందరికీ స్ఫూర్తిగా నిలిచావు.
–లక్ష్మణ్‌

రిటైర్మెంట్‌ను బాగా ఆస్వాదించు.
–బ్రాడ్‌

‘విశ్వ’ రూపం
యువరాజ్‌ కెరీర్‌లో 2011 వన్డే ప్రపంచ కప్‌ విజయం ఎవరెస్ట్‌లాంటిది. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అతను భారత్‌ 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు సహా 362 పరుగులు చేసిన అతను... 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా నిలిచాడు.  

వ్యక్తిగత జీవితం...
తండ్రి యోగ్‌రాజ్, తల్లి షబ్నమ్‌ విడాకులు తీసుకొని విడిపోయినా యువరాజ్‌ వారిద్దరికీ ఎప్పుడూ దూరం కాలేదు. తల్లితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న అతను తండ్రితోనూ సంబంధాలు కొనసాగించాడు. కొన్నిసార్లు యోగ్‌రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డా... తనకు ఆటలో ఓనమాలు నేర్పిన తండ్రిని గౌరవిస్తూనే వచ్చాడు. 2015 ఐపీఎల్‌ సీజన్‌లో యువరాజ్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఇదే రికార్డుగా ఉంది. 2016లో నటి హాజల్‌ కీచ్‌తో యువీకి పెళ్ళయింది. బాల నటుడిగా రెండు పంజాబీ చిత్రాల్లో కూడా యువరాజ్‌ నటించాడు. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’... 2014లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top