అతడిని ఎప్పటికీ క్షమించను: యువీ తండ్రి

Yograj Singh Says Cannot Forgive Greg Chappell - Sakshi

చండీగఢ్‌: యువరాజ్‌ సింగ్‌కు చిన్నతనంలో క్రికెట్‌ అంటే ఇష్టముండేది కాదని అతడి తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ తెలిపారు. క్రికెట్‌ మీద తనకు ఉన్న ఇష్టంతోనే కొడుకుతో బ్యాట్‌ పట్టించానని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. (చదవండి: యువరాజ్‌ గుడ్‌బై)

‘ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే యువీకి క్రికెట్‌ బ్యాట్‌ కొనిచ్చాను. వాడికి ఫస్ట్‌ బౌలర్‌ మా అమ్మ గుర్నమ్‌ కౌర్‌. మెల్లగా బంతి విసిరి వాడికి ఆట నేర్పేది. ఇప్పటికీ ఈ ఫొటో మా దగ్గర ఉంది. వయసు పెరిగేకొద్ది స్కేటింగ్‌, టెన్నిస్‌ ఆడటం మొదలుపెట్టాడు. క్రికెట్‌కు దూరమైపోతాడన్న భయంతో స్కేటింగ్‌ కిట్‌ను బయటకు విసిరేసి, టెన్నిస్‌ రాకెట్‌ను విరగొట్టేశాడు. అప్పుడు యువీ బాగా ఏడ్చాడు. నా మీద కోపంతో సెక్టార్‌ 11లో ఉన్న మా ఇంటిని జైలు అని, నన్ను డ్రాగన్‌ సింగ్‌ అంటూ పిలిచేవాడు. తర్వాత మెల్లగా వాడి దృష్టిని క్రికెట్‌వైపు మళ్లించాను. ఆరేళ్ల ప్రాయంలో యూవీని సెక్టార్‌ 16లోని స్టేడియంలోని పేస్‌ బౌలింగ్‌ అకాడమీకి తీసుకెళ్లాను. హెల్మెట్‌ లేకుండా ప్రాక్టీస్‌ చేయమని వాడికి చెప్పాను. శిక్షణలో భాగం‍గా రోజూ గంటన్నరపాటు స్టేడియంలో పరుగెత్తేవాడు. నాకు బాగా గుర్తుంది. యువీకి కఠిన శిక్షణ ఇప్పించడం చూసి మరణశయ్యపై ఉన్న మా అమ్మ ఒకసారి నన్ను మందలించింది. వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నానని మండిపడింది. ఈ ఒక్క విషయంలోనే నా కుమారుడి పట్ల కఠినంగా ఉన్నందుకు బాధ పడ్డాను. మొదట్లో క్రికెట్‌ను యువీ ద్వేషించాడు. కానీ క్రికెట్‌ను అతడు ప్రేమించేలా చేశాను. క్రికెట్‌లో అతడు ఏం సాధించాడో ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలుసున’ని యోగ్‌రాజ్‌ ఒకింత గర్వంగా అన్నారు.

ఒంటరిగా కూర్చుని ఏడ్చాను
తన కుమారుడికి క్యాన్సర్‌ సోకిందని తెలియగానే అంతులేని బాధ కలిగిందని యోగ్‌రాజ్‌ సింగ్‌ తెలిపారు. క్యాన్సర్‌తో యువీ కథ ముగియకూడదని దేవుడిని ప్రార్థించాను. తానేప్పుడు యువీ ఎదుట బాధ పడలేదని, గదిలో ఒంటరిగా ఏడ్చేవాడినని వెల్లడించారు. క్యాన్సర్‌తో తాను చనిపోతే.. తన చేతిలో వరల్డ్‌కప్‌ ట్రోఫినీ ప్రపంచమంతా చూడాలని తనతో యువీ చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. రిటైర్‌మెంట్‌ ప్రకటనకు ముందు చండీగఢ్‌లో రెండు రోజుల పాటు యువీ సంతోషంగా గడిపాడని చెప్పారు. (చదవండి: మైదానంలో ‘మహరాజు’)


చాపెల్‌ను క్షమించను

యువీ కెరీర్‌ను భారత క్రికెట్‌ మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ నాశనం చేశాడని యోగ్‌రాజ్‌ సింగ్‌ మండిపడ్డారు.‘చాపెల్‌ కోచ్‌గా ఉన్నప్పుడు ఖోఖో ఆడుతుండగా యువీ మోకాలికి గాయమైంది. ఇది అతడి క్రీడాజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. గాయపడకుంటే వన్డే, టీ20ల్లో అంతర్జాయతీయ రి​కార్డులన్నిటినీ యువీ బద్దలుకొట్టేవాడు. కోచ్‌గా ఉన్నప్పుడు నెట్‌ ప్రాస్టీస్‌కు ముందు ఖోఖో లాంటి దేశీయ ఆటలను చాపెల్‌ ఆడించేవాడు. ఇలా ఆడుతున్నపుడే యువీ గాయపడ్డాడు. నా కుమారుడి క్రీడా జీవితాన్ని నాశనం చేసినందుకు చాపెల్‌ను ఎన్నటికీ క్షమించలేన’ని యోగ్‌రాజ్‌ అన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top