అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం సిద్ధం..

World's Biggest Cricket Stadium Takes Shape In Ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌: ఇప్పటివరకూ వరల్డ్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ మరికొద్ది రోజుల్లో రెండో స్థానానికే పరిమితం కానుంది. భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో నిర్మించిన నూతన క్రికెట్‌ స్టేడియం ఇక నుంచి ప్రపంచ అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం కానుంది. అహ్మదాబాద్‌లోని కొత్త క్రికెట్‌ స్టేడియం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవడంతో వచ్చే ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు షురూ చేశారు. దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా 10 వేలు.  

దాంతో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం లక్ష కెపాసిటీని అహ్మదాబాద్‌ నూతన స్టేడియం అధిగమించనుంది.  ఇందులో 70 కార్పోరేట్‌ బాక్స్‌లను, నాలుగు డ్రెస్సింగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మరొకవైపు ఒలింపిక్స్‌ సైజ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ సైతం ఇందులో ఉంది. 2017 జనవరిలో ఈ స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించగా పూర్తి కావడానికి సుమారు మూడేళ్లు పట్టింది. అంతకుముందు ఇక్కడ ఉన్న సర్దాల్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది మార్చిలో ఇక్కడ మ్యాచ్‌ జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆసియా ఎలెవన్‌-వరల్డ్‌ ఎలెవన్‌ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో భారత్‌లో అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ ఉండేది. దాని కెపాసిటీ సుమారు లక్ష కాగా, ప్రధాన బిల్డింగ్‌ పునః నిర్మాణంలో  దాన్ని 66 వేలకు తగ్గించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top