అనూహ్యం: వన్డే క్రికెట్ చరిత్రలో మూడోసారి..

West Indies lose against England in fourth odi

లండన్‌: వెస్టిండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయీస్‌ మెరుపు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించినా.. బౌలింగ్‌లో అల్జారి జోసెఫ్ ఐదు వికెట్లతో చెలరేగినా ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఎవరూ ఊహించని రీతిలో నాలుగో వన్డేలో విండీస్‌పై ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. విండీస్ తరఫున సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఇన్నింగ్స్ నమోదైనా వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. తద్వారా ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో ఇలాంటి ఫలితం రావడం ఇది మూడోసారి. మరొకవైపు వన్డేల్లో ఈ తరహా అరుదైన ఓటమిని రెండోసారి చవిచూసిన జట్టుగా విండీస్ నిలిచింది.

ఆ విశేషాలిలా... ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో తొలుత విండీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లూయీస్‌ (130 బంతుల్లో 176 రిటైర్డ్‌హర్ట్‌; 17 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత సెంచరీ చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. ఆపై విండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్ ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌ (5/56 )తో చెలరేగడంతో ఇంగ్లండ్ 181 పరగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరో వికెట్‌కు బట్లర్ 43 నాటౌట్, మొయిన్ అలీ 48 నాటౌట్‌లు 77 పరుగుల జోడించారు. 35.1 ఓవర్లలో 258 పరుగుల వద్ద వరుణుడు ఆటకం కలిగించడంతో మ్యాచ్ కొనసాగలేదు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 35.1 ఓవర్లలో ఇంగ్లండ్ విజయక్ష్యం 253గా నిర్ణయించడంతో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

గతంలో రెండు పర్యాయాలు.. ఇదే ఫలితం
1991-1992లో షార్జాలో వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఇలాంటి ఫలితం వచ్చింది. విండీస్ జట్టులో ఓ ఆటగాడు సెంచరీ సాధించడం, అదే జట్టు బౌలర్ ఐదు వికెట్లతో చెలరేగినా కరీబియన్లకు నిరాశే ఎదురైంది. తొలుత 50 ఓవర్లలో పాక్ 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. 237 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లాడి 235 పరగులకు ఆలౌట్ అయి పరుగుతేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఆటగాడు రిచి రిచర్డ్‌సన్ శతకం (122)తో పాటు బౌలింగ్‌లో ఆంబ్రోస్ (5/53)తో చెలరేగినా ఓటమి తప్పలేదు.

2005-2006 సీజన్లలో జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐదో వన్డేలో రికార్డు పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా జట్టు రికీ పాంటింగ్ శతకం (164)తో రాణించడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 434 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను ఆసీస్ బౌలర్ నాథన్ బ్రాకెన్ ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌ (5/67)తో చెలరేగి కట్టడి చేసినా ప్రయోజనం లేకపోయింది. సఫారీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (90), గిబ్స్ భారీ శతకం (175 పరుగులు)తో అద్భుత విజయం సాధించింది. సిరీస్‌ను సఫారీలు 3-2తో కైవసం చేసుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top