
భారత జట్టు
దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరినప్పుడు ఈసారి భారత జట్టు మూడు ఫార్మాట్‌లలో సిరీస్ విజయాలతో తిరిగి వస్తుందని అందరూ భావించారు. కానీ అది సాధ్యపడలేదు. తొలి రెండు టెస్ట్‌ల్లో మంచి పోరాటం చేసినప్పటికీ నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ వైఫల్యాలతో రెండు టెస్టులూ చేజారాయి. దీంతో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. మూడో టెస్ట్‌లో కఠినమైన పిచ్‌పై మన బౌలర్లు పేస్, బౌన్స్ ఉపయోగించుకొని కచ్చితత్వంతో బంతులు వేసి ప్రత్యర్థి ఆటకట్టించారు.
ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటన రూపంలో భారత్‌కు మరో కఠిన సవాల్ ఎదురుకానుంది. కానీ... ఆ పర్యటన వన్డే సిరీస్‌తో ప్రారంభమవుతుంది. తొలి టెస్టు ఆడే సమయానికి కోహ్లి సేన ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టి దాదాపు నెల గడుస్తుంది. పరిస్థితులపై ఓ అవగాహన ఏర్పడటానికి ఆ సమయం చాలా ఉపయోగపడనుంది. చివరి టెస్టు విజయం భారత జట్టుపై చాలా ప్రభావం చూపింది. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో మనవాళ్లు వన్డేల్లో అదరగొడుతున్నారు. ప్రతీ మ్యాచ్‌లో టాప్ 3 బ్యాట్స్‌మెన్ 30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. 118 పరుగులు మాత్రమే చేయాల్సిన రెండో వన్డేలో మినహా ఆ ముగ్గురూ సెంచరీలు సాధించారు.
ఈ విజయాల్లో లెగ్ స్పిన్నర్ల పాత్ర మరువలేనిది. చహల్, కుల్దీప్‌ల బౌలింగ్ సఫారీలకు కొరుకుడు పడటంలేదు. సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లాడినప్పటికీ వీరి స్పిన్‌పై ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. కుల్దీప్ ఇప్పటికే టెస్టుల్లోనూ తానెంతటి ప్రమాదకారో నిరూపించుకున్నాడు. బుమ్రా పరిమిత ఓవర్ల నుంచి ఐదు రోజుల ఫార్మాట్‌కు మారినా తన ప్రభావం చూపించాడు. ఇక చహల్ వంతు. అతనూ టెస్టుల్లో రాణిస్తాడనటంలో సందేహం లేదు. మణికట్టు స్పిన్ బౌలర్లలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వారికి పిచ్‌నుంచి సహకారంలాంటిది అవసరం లేదు. భారత జట్టు తాజా ప్రదర్శన నాకు అమితానందాన్ని కలిగిస్తోంది. చివరి వన్డేలోనూ టీమిండియా విజయం సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.