ఓటమికి మేం అర్హులమే: స్టీవ్‌ స్మిత్‌

We deserved to lose series: Steve Smith

భారత్‌తో జరిగిన ప్రతిష్టాత్మక వన్డే సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోవడంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఒకింత నిర్వేదంగా స్పందించాడు. సిరీస్‌లో ఈ పరాభవానికి తాము అర్హులమేనని పేర్కొన్నాడు. ఇకనుంచి రాబోయే సిరీస్‌లలోనైనా స్థిరమైన ఆటతీరుతో రాణించాల్సిన అవసరముందని చెప్పాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ఐదో వన్డేలో ఆసీస్‌ విసిరిన 243 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ సునాయసంగా ఛేదించింది. రోహిత్‌ శర్మ సెంచరీ సాధించి సత్తా చాటడంతో 43 బంతులు ఉండగానే భారత్‌ విజయాన్ని అందుకొని.. 4-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మొదట బ్యాటింగ్‌ చేసిన తమ జట్టు 50-60 పరుగులు తక్కువ రాబట్టడం వల్లే ఓటమిపాలైందని, నాగపూర్‌ వికెట్‌పై 300లకుపైగా పరుగులు చేస్తే తమకు విజయ అవకాశాలు ఉండేవని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. ' 300 పరుగులు చేస్తే బాగుండేది. మా టాప్‌ ఫోర్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకరు భారీ స్కోరు చేసి ఉండాల్సింది. వరుసగా వికెట్లు కోల్పోయాం. ఇకనుంచైనా మమ్మల్ని మేం మెరుగుపరుచుకొని స్థిరమైన ఆటతీరు కనబర్చాల్సి ఉంది. స్థిరమైన ఆటతీరుకు అనుగుణమైన సమన్వయాన్ని మేం సాధించాలి. ఆటలో మమ్మల్ని చిత్తుచేశారు. 4-1 తేడాతో సిరీస్‌ ఓటమికి మేం అర్హులమే' అని 28 ఏళ్ల స్మిత్‌ అన్నాడు. ఇండియాలో తమ ఆటగాళ్లు ఎంతో క్రికెట్‌ ఆడారని, అయినా దానిని ఓటమికి సాకుగా చూపబోనని చెప్పాడు. సానుకూల దృక్పథంతో సాగేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. భారత క్రికెట్‌ జట్టు చాలా బాగా ఆడిందని, జట్టు సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉందని స్మిత్‌ కితాబిచ్చాడు. టీ-20 సిరీస్‌ ప్రారంభానికి ఇంకా ఆరురోజుల సమయం ఉందని, బాగా ఆడి కనీసం ఈ ట్రోఫీని ఇంటికి తీసుకెళుతామని స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top