
సెహ్వాగ్ పాస్‌ల గోల!
2011 వన్డే వరల్డ్ కప్... ఆ రోజు బెంగళూరులో ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్.
న్యూఢిల్లీ: 2011 వన్డే వరల్డ్ కప్... ఆ రోజు బెంగళూరులో ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్. ఉదయమే భారత కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ జట్టు సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతలో నేనో మాట చెబుతాను అంటూ వీరేంద్ర సెహ్వాగ్‌లాంటి సీనియర్ క్రికెటర్ ముందుకు వస్తే ఎవరైనా ఏం ఆశిస్తారు? మ్యాచ్ రోజు వ్యూహాల గురించో, బలాలు, బలహీనతల గురించో మాట్లాడతాడని అంతా అనుకుంటారు. కానీ వీరూ రూటే సపరేటు... అందుకే మీటింగ్‌లో అతను తన బాధ చెప్పుకున్నాడు.
‘నిబంధనల ప్రకారం ఒక్కో క్రికెటర్‌కు ఆరు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇస్తారని నాకు తెలిసింది. కానీ మనకు మూడే ఇస్తున్నారు. అందుకే దీనిపై నేను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నా. టాస్‌కు ముందే మనకు లెక్క ప్రకారం పాస్‌లు ఇచ్చేయాలి. అవసరమైతే అవి అందేవరకు మ్యాచ్ కూడా ఆడవద్దు’ అంటూ ధారాళంగా చెబుతూ పోవడంతో జట్టు సభ్యులంతా అవాక్కయి అతని వైపు చూస్తూ ఉండిపోయారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వూ్యలో స్పిన్నర్ అశ్విన్ పంచుకున్నాడు. అసలు సెహ్వాగ్‌కు జట్టు సమావేశాలు అంటే ఇష్టం ఉండేది కాదని, బంతిని చూసి బాదడమే తప్ప వ్యూహాలు అనేది అతనికి నచ్చని విషయమంటూ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.