నవ్వులు పూయించిన కోహ్లి | Virat Kohli imitates Jasprit Bumrah Bowling Action | Sakshi
Sakshi News home page

బుమ్రాను ఇమిటేట్‌ చేసిన కోహ్లి

Jul 10 2019 1:15 PM | Updated on Jul 10 2019 1:25 PM

Virat Kohli imitates Jasprit Bumrah Bowling Action  - Sakshi

విరాట్‌ కోహ్లి

సరిగ్గా దీన్నే మ్యాచ్‌ ఆగిపోయిన అనంతరం కోహ్లి అనుకరించి..

మాంచెస్టర్‌ : టీమిండియా పేసర్‌, యార్కర్ల కింగ్‌ జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ విలక్షణమైన శైలితో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ శైలితోనే 22 అడుగుల పిచ్‌పై ఈ డెత్‌ఓవర్ల స్పెషలిస్ట్‌ అదరగొడుతున్నాడు. ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తున్నాడు. బుమ్రా శైలిని ఇప్పటి వరకు చాలా మంది అనుకరించారు. మనదేశమే కాదు.. ఇతర దేశాల అభిమానులు, పిల్లలు బుమ్రా బౌలింగ్‌శైలికి ముగ్ధులై ఇమిటేట్‌ చేశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఈ సారి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్‌ చేశాడు.

మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు బ్లాక్‌ క్యాప్స్‌ ఆటగాళ్లను చెడుగుడు ఆడుకున్నారు. కళ్లు చెదిరే బంతులతో ముప్పుతిప్పలు పెట్టారు. ఈ దెబ్బకు ఆ జట్టు ఓపెనర్లు రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. ఎదుర్కొన్న 17వ బంతికి గానీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక బుమ్రా వేసిన అద్భుత బంతికి కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్లిప్‌ దిశగా దూసుకొచ్చిన ఈ క్యాచ్‌ను కోహ్లి అద్భుతంగా అందుకున్నాడు. ఈ వికెట్‌ అనంతరం చేతులు చాపుతూ బుమ్రా సంబరాలు జరుపుకున్నాడు. సరిగ్గా దీన్నే మ్యాచ్‌ ఆగిపోయిన అనంతరం నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌లో కోహ్లి అనుకరించి నవ్వులు పూయించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.
 
ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (85 బంతుల్లో 67 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), విలియమ్సన్‌ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఐదుగురు భారత బౌలర్లు తలా ఒక వికెట్‌ తీశారు. ప్రస్తుతం టేలర్‌తో పాటు లాథమ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement