
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్, ఐపీఎల్‌లో అత్యధిక పారితో షికం అందుకుంటున్న విరాట్ కోహ్లి... ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రేకు మాత్రం సాధారణ మ్యాచ్ ఫీజుతోనే ఆడనున్నాడు. దీంతోపాటు అతడి విమాన ప్రయాణ, వసతి ఖర్చులను మాత్రమే సర్రే చెల్లించనుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తాజాగా తెలిపారు. అసలు కాంట్రాక్టు మొత్తం వెల్లడించలేమన్న ఆయన... సగటు కౌంటీ ఆటగాడికి ఎంత చెల్లిస్తున్నారో అంతే ఉంటుందని వివరించారు.
భారత్ జూన్ నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. 2014లో అక్కడ ఎదురైన చేదు అనుభవాలను చెరిపివేయాలని గట్టి పట్టుదలతో ఉన్న కోహ్లి, మ్యాచ్ ఫీజు విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాడు. మరోవైపు విరాట్–సర్రే ఒప్పందం మార్చిలోనే వెల్లడైనా అతడి ఆకర్షణ స్థాయిని కౌంటీ జట్టు వాణిజ్య కోణంలో ఉపయోగించుకుంటుందని బీసీసీఐ అనుమానించింది. దీంతో ఒప్పందం ఆచరణలోకి రావడానికి సమయం పట్టింది. ఇక కౌంటీల్లో కోహ్లి మొత్తం ఆరు మ్యాచ్‌లు (మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు, మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు) ఆడనున్నాడు.