‘మెగా సమరం’లో పైచేయి ఎవరిదో? | Sakshi
Sakshi News home page

‘మెగా సమరం’లో పైచేయి ఎవరిదో?

Published Sun, Jun 9 2019 2:50 PM

Unchanged India Opted to Bat Against Australia - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లి మరో మాట లేకుండా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు.  తాజా మ్యాచ్‌లో భారత్‌ ఎటువంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్‌ సెమీ్‌సలో భారత్‌ను ఓడించి టైటిల్‌ ఆశలను నీరుగార్చిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. రెండు జట్లకు తాజా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమి లేదు. ఆసీస్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గగా భారత్‌ ఏకైక పోరులో సఫారీలను ఓడించింది. ఈ ఏడాది ఆసీస్‌, భారత్‌ ఎనిమిదిసార్లు తలపడితే 4-4తో సమానంగా ఉన్నాయి.

రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 136 వన్డేలు జరగ్గా భారత్‌ 49 గెలిచింది. ఆస్ట్రేలియా 77 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో పదకొండు మ్యాచ్‌లకు గాను భారత్‌ మూడింట్లో, ఆసీస్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గాయి. కప్‌ ప్రారంభానికి ముందు భారత్‌కు ఓపెనర్ల ఫామ్‌పై ఆందోళన నెలకొంది. దక్షిణాఫ్రికాపై ఏకంగా సెంచరీ బాది రోహిత్‌ శర్మ టచ్‌లోకి వచ్చాడు. మిగిలింది శిఖర్‌ ధావన్‌. ఐసీసీ ఈవెంట్లలో మెరుగ్గా రాణించే అతడు జోరందుకోవాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్‌ కోహ్లి తన స్థాయి ఇన్నింగ్స్‌ ఆడితే ప్రత్యర్థి తేలిపోవడం ఖాయం. తర్వాతి బాధ్యత కేఎల్‌ రాహుల్, ధోని, కేదార్‌ జాదవ్‌లది. ఆఖర్లో చెలరేగేందుకు హార్దిక్‌ పాండ్యా ఉండనే ఉన్నాడు.

కాగా, ఆస్ట్రేలియాకు తమ శక్తిసామర్థ్యాలను మరింత పరీక్షించుకునే అవకాశం భారత్‌తో మ్యాచ్‌ ద్వారా లభించనుంది.  ప్రధాన బ్యాట్స్‌మెన్‌ వార్నర్, స్మిత్‌ అర్ధసెంచరీలతో ఫామ్‌ చాటుకోగా... కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్, ఖాజా ఇంకా గాడిలో పడలేదు. మ్యాక్స్‌వెల్‌ కూడా రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ క్యారీ, కూల్టర్‌ నైల్‌ జట్టు బ్యాటింగ్‌ లోతేమిటో చాటారు. స్టొయినిస్‌ ఆల్‌ రౌండ్‌ పాటవం, పేసర్లు స్టార్క్, కమిన్స్‌ ఫామ్‌ ఆసీస్‌కు పెద్ద బలం. ప్రపంచకప్‌ల్లోనూ ఈ రెండు జట్లు ఢీకొన్న ప్రతీసారి అభిమానుల్లో ఆసక్తి రెట్టింపవుతుంది. ఈసారి కూడా మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. వరుస విజయాలతో హోరెత్తిస్తున్న ఆసీస్‌పై సత్తా నిరూపించుకుంటే భారత్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.మరి, ఎంతో ఆసక్తిని రేపుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏం చేస్తుందో చూడాలి.

తుది జట్లు

భారత్‌
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా
అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్‌, అలెక్స్‌ క్యారీ, కౌల్టర్‌ నైల్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా

Advertisement
Advertisement