7 వికెట్లతో చెలరేగిన ఉమేశ్‌

Umesh Yadav helps Vidarbha take control against Kerala - Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో కేరళ 106కే ఆలౌట్‌

సౌరాష్ట్రతో మ్యాచ్‌లో కర్ణాటక 264/9

రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌  

వాయనాడ్‌: దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ రంజీట్రోఫీ 68 ఏళ్ల చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌ చేరిన కేరళ ఆనందాన్ని టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ (7/48) ఆవిరి చేశాడు.  గురువారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ తరఫున బరిలో దిగిన అతడు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. దీంతో కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో 28.4 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. ఏడో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ విష్ణు వినోద్‌ (37 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. ఉమేశ్‌ ధాటికి... విష్ణు, కెప్టెన్‌ సచిన్‌ బేబీ (22), పేసర్‌ బాసిల్‌ థంపి (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

రజనీష్‌ గుర్బానీ (3/38) మిగతా మూడు వికెట్లను పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భను కేరళ పేసర్లు సందీప్‌ వారియర్‌ (2/46), దినేశన్‌ నిధీశ్‌ (2/53) ఇబ్బంది పెట్టారు. అయితే, కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (75) అర్ధ సెంచరీతో పాటు వెటరన్‌ వసీం జాఫర్‌ (34) రాణించడంతో ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఇప్పటికే 65 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. 

కర్ణాటక 30/4 నుంచి 264/9కు... 
బెంగళూరు: మరో సెమీస్‌లో సౌరాష్ట్ర పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ (4/50) మెరుపు బౌలింగ్‌కు తొలుత తడబడిన కర్ణాటక తర్వాత నిలదొక్కుకుంది. ఉనాద్కట్‌... ఓపెనర్లు ఆర్‌.సమర్థ్‌ (0), మయాంక్‌ అగర్వాల్‌ (2), సిద్ధార్థ్‌ (12)లను స్వల్ప వ్యవధిలోనే ఔట్‌ చేయడం, కరుణ్‌ నాయర్‌ (9)ను చేతన్‌ సకారియా వెనక్కి పంపడంతో కర్ణాటక 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆల్‌ రౌండర్‌ శ్రేయస్‌ గోపాల్‌ (182 బంతుల్లో 87; 9 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ మనీశ్‌ పాండే (67 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 106 పరుగులు జోడించారు.

చివరకు పాండేను ఉనాద్కట్‌ పెవిలియన్‌ చేర్చి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కమలేశ్‌ మక్వానా (3/73)... శ్రేయస్‌ గోపాల్‌తో పాటు కృష్ణప్ప గౌతమ్‌ (2), అభిమన్యు మిథున్‌ (4) వికెట్లను పడగొట్టినా మరో ఎండ్‌లో వికెట్‌ కీపర్‌ శ్రీనివాస్‌ శరత్‌ (177 బంతుల్లో 74 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) పట్టుదల చూపి అర్ధ శతకం సాధించాడు. దీంతో కర్ణాటక 264/9తో రోజును ముగించింది.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top