
సెరెనా అలవోకగా..
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ అలవోకగా ఫైనల్కు దూసుకెళ్లింది.
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ అలవోకగా ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో సెరెనా 6-2, 6-0 తేడాతో ఎలెనా ఎస్నినాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఏకపక్ష పోరులో రెండు సెట్లను అవలీలగా గెలిచిన సెరెనా తన సత్తాను చాటుకుంటూ టైటిల్ వేటకు అడుగుదూరంలో నిలిచింది. గతేడాది వింబుల్డ్ను గెలిచిన సెరెనా.. ఆ తరువాత వరుసగా మూడు గ్రాండ్ స్లామ్ల్లో ఓటమి పాలైంది.
2015లో యూఎస్ ఓపెన్ లో రన్నరప్గా సరిపెట్టుకున్న నల్లకలువ.. 2016లో ఇప్పటివరకూ వరుసగా జరిగిన ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్లను సాధించడంలో విఫలమైంది. వింబుల్డన్ లో చివరి అడ్డంకిని సెరెనా అధిగమిస్తే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. ఇప్పటివరకూ సెరెనా 303 గ్రాండ్ స్లామ్ విజయాలను సాధించగా, వింబుల్డన్ లో 9వ సారి ఫైనల్ కు చేరింది. ఇందులో ఆరు సార్లు టైటిల్ ను సాధించడంలో సెరెనా సఫలమైంది. సెరెనా విలియమ్స్ తన తుదిపోరులో కెర్బర్తో కానీ, అక్క వీనస్ విలియమ్స్తో కానీ తలపడనుంది. వీరి మధ్య మహిళల రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.