ఒలింపిక్స్‌ నిర్వహణకు వాటితో సంబంధం లేదు: ఐఓసీ

Tokyo Games not contingent on COVID-19 vaccine - Sakshi

సిడ్నీ: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చాకే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యుడు జాన్‌ కోట్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడల నిర్వహణకు సంబంధించి పలువురు శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తోన్న ఈ వ్యాక్సిన్‌ ప్రతిపాదనను తాను అంగీకరించనని బుధవారం పేర్కొన్నారు. స్వయంగా లాయర్‌ అయిన జాన్‌ కోట్స్‌ (ఆస్ట్రేలియా)... డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము విశ్వ క్రీడల విషయంలో సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో టీకా ప్రస్తావనే లేదన్నారు. ‘వ్యాక్సిన్‌ కనుగొంటే మంచిదే. కానీ మేమైతే డబ్ల్యూహెచ్‌వో, జపాన్‌ వైద్య సంస్థలు చెప్పిన ప్రకారమే నడుచుకుంటున్నాం.

ఒలింపిక్స్‌ వాయిదా పడినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా పనులు జరిగాయి. రీషెడ్యూల్‌ తేదీకి క్రీడలు జరుగుతాయి. అందుకుగానూ ఇంకా 43 వేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నాం’ అని కోట్స్‌ అన్నారు. వాయిదా కారణంగా తమపై కొన్ని వందల మిలియన్‌ డాలర్ల అదనపు భారం పడనుందని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అన్నారు. ‘వాయిదా కారణంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వసతులపై సమీక్షించాలి. నిర్వహణ వ్యయం కచ్చితంగా పెరుగుతుంది. దీన్ని భరించేందుకు ఐఓసీ సిద్ధంగా ఉంది. కచ్చితంగా ఇది కొన్ని వందల మిలియన్‌ డాలర్లు ఉంటుందని అనుకుంటున్నాం’ అని బాచ్‌ వివరించారు. మరోవైపు జపాన్‌ ప్రధాని షింజో అబె, జపాన్‌ వైద్య సంఘం అధ్యక్షుడు యోషితాకే యోకొకురా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణలోకి రాని పక్షంలో క్రీడలు జరిగే అవకాశం లేదన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top