విజయీభవ..! 

Today Asian Hockey Champions Trophy start - Sakshi

నేటి నుంచి ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీ

టైటిల్‌ ఫేవరెట్‌గా భారత్‌

తొలి మ్యాచ్‌లో నేడు ఒమన్‌తో ‘ఢీ’

రాత్రి గం. 10.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

మస్కట్‌: వచ్చే నెలలో స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనే లక్ష్యంతో... నేటి నుంచి మొదలయ్యే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ బరిలోకి దిగుతోంది. ఆరు జట్ల మధ్య లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాతో పాటు టైటిల్‌ ఫేవరెట్‌గా పోటీపడుతోంది. గురువారం జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్‌తో భారత్‌ తలపడనుంది. చివరిసారి 2014 ఆసియా క్రీడల్లో ఒమన్‌తో ఆడిన భారత్‌ ఆ మ్యాచ్‌లో 7–0తో అలవోకగా గెలిచింది. ఈసారీ టీమిండియా నుంచి అలాంటి ఫలితమే పునరావృతమయ్యే అవకాశముంది. 2011 నుంచి ఇప్పటివరకు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని నాలుగుసార్లు నిర్వహించారు. భారత్‌ 2011లో, 2016లో టైటిల్‌ సాధించింది. 2012లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి భారత్‌తోపాటు పాకిస్తాన్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా, ఒమన్‌ జట్లు పాల్గొంటున్నాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్‌ ఈనెల 28న జరుగుతుంది. ఒమన్‌తో మ్యాచ్‌ తర్వాత భారత్‌  ఈ నెల 20న పాకిస్తాన్‌తో, 21న జపాన్‌తో, 23న మలేసియాతో, 24న కొరియాతో ఆడుతుంది.  

‘తొలి మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా విజయంతో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉన్నాం. ప్రపంచంలోని మేటి జట్లను ఓడించే సత్తా ఈ జట్టులో ఉంది. అయితే కొన్నిసార్లు ఊహించని తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంటున్నాం. మ్యాచ్‌ మొదలైన క్షణం నుంచి చివరి సెకను వరకు పూర్తి ఏకాగ్రతతో ఆడుతూ... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా రాణించాల్సిన అవసరం ఉంది. ఆసియా క్రీడల్లో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని తమ ప్రదర్శ నతో జట్టు ఆటగాళ్లు నిరూపించుకోవాలి’ అని భారత జట్టు చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. 2016 ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ అజేయంగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 10–2తో ఓడించిన భారత్‌ తదుపరి మ్యాచ్‌లో కొరియాతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. అనంతరం 3–2తో పాకిస్తాన్‌పై, 9–0 తో చైనాపై, 2–1తో మలేసియాపై గెలుపొందింది. సెమీఫైనల్లో 5–4తో కొరియాను ఓడించి, ఫైనల్లో 3–2తో పాకిస్తాన్‌పై నెగ్గి టైటిల్‌ సాధించింది. 

భారత హాకీ జట్టు: పీఆర్‌ శ్రీజేశ్, కృష్ణ బహదూర్‌ పాఠక్‌ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్‌ సింగ్, గురీందర్‌ సింగ్, వరుణ్‌ కుమార్, కొతాజిత్‌ సింగ్, సురేందర్‌ కుమార్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), సుమీత్, నీలకంఠ శర్మ, లలిత్‌ కుమార్‌ ఉపాధ్యాయ్, చింగ్లేన్‌సనా సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆకాశ్‌దీప్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top