‘ఓపెనింగ్‌’ మార్పుకు సమయం

This is the time to change opening pair - Sakshi

టెస్టుల్లో క్రీజులో పాతుకుపోయి... కొత్త బంతి దాడిని కాచుకుంటూ... వీలునుబట్టి బౌలర్ల లయను దెబ్బతీస్తూ... ఒకవిధంగా మిడిలార్డర్‌లోని మేటి బ్యాట్స్‌మెన్‌కు రక్షణ కవచంగా నిలిచేది ఓపెనింగ్‌ జోడి! ప్రత్యర్థిపై ఆదిలోనే ఆధిపత్యం చూపుతూ, జట్టు మానసికంగా పైచేయి సాధించడంలో వీరిదే ప్రధాన పాత్ర. అయితే మిగతా జట్లలో ఒకరు విఫలమైతే మరొకరు నిలదొక్కుకుంటూ కొంతలో కొంత నయం అనిపిస్తున్నారు. కానీ, టీమిండియా విషయంలో మాత్రం ‘ముగ్గురు’ ఓపెనర్లూ మూకుమ్మడిగా చేతులెత్తేస్తున్నారు. ఏ ఇద్దరిని ఆడించినా, ఆటగాడి మార్పు తప్ప ఆటతీరు మారడం లేదు.

సాక్షి క్రీడా విభాగం
ఓపెనర్లకు ఉండాల్సిన కనీస లక్షణాలు భారత ఆరంభ జోడీలో లోపించాయి. దీంతో కీలక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ చాలా ముందుగానే క్రీజులోకి రావాల్సి వస్తోంది. బర్మింగ్‌హామ్, లార్డ్స్‌ టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి 25 ఓవర్లలోపే బ్యాటింగ్‌కు దిగాడు. కొత్త బంతి విపరీతంగా స్వింగ్‌ అయ్యే ఇంగ్లండ్‌లో, వందల కొద్దీ ఓవర్లు ఆడాల్సిన ఐదు రోజుల మ్యాచ్‌కు ఇది ఎంతమాత్రం సరైన తీరు కాదు. కోహ్లి, పుజారా, రహానే విఫలమైతే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించే వారే లేకుండా పోతారు.

ఇక్కడే(నా) పోటాపోటీ...
మురళీ విజయ్, శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్‌... స్వదేశంలో టెస్టు సిరీస్‌ అంటే వీరిలో ఎవరిని తప్పించి, ఎవరిని ఆడించాలి అనేది టీమిండియాకు పెద్ద తలనొప్పి. అదే విదేశాలకు వచ్చేసరికి మాత్రం ఒకరివెంట ఒకరి వైఫల్యంతో అసలు ఎవరిని ఆడించాలో తెలియని డైలమా. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో, ప్రస్తుత ఇంగ్లండ్‌ టూర్‌లో ఇదే విషయం మళ్లీమళ్లీ స్పష్టమైంది. అయినా శుభారంభం మాత్రం కలే అవుతోంది. విజయ్‌–ధావన్‌ ద్వయం తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుదురుగానే కనిపించింది.  స్వల్ప లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో వైఫల్యంతో ఆ ప్రదర్శన మరుగునపడింది. ఇక రాహుల్‌ది మరో తరహా కథ. భారత్‌లో భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతూ, విదేశాల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఆడిన నాలుగు టెస్టుల్లో అతడు కనీసం అర్ధ శతకమైనా చేయలేకపోవడమే దీనికి నిదర్శనం.

విజయ్‌కి ఏమైంది
టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్‌ ఓపెనర్‌ మురళీ విజయ్‌. వాస్తవంగా చూస్తే ఇటీవల ఎక్కువగా నిరాశపరుస్తోంది అతడే. కానీ, డిఫెన్స్‌తో పాటు విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం విజయ్‌ను కాపాడుతోంది. ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్‌... సఫారీ టూర్‌లో ఆకట్టుకోలే కపోయాడు. అయినప్పటికీ తనపై భరోసా ఉంచారు. బౌలర్ల వలలో పడకుండా వారి సహనాన్ని పరీక్షించే విజయ్‌ ఇటీవల దానికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఫుట్‌వర్క్‌ కూడా మునుపటిలా లేకపోవడంతో వికెట్‌ ఇచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితుల నుంచి విజయ్‌ తొందరగా బయటపడాల్సిన అవసరం ఉంది. లేదంటే... తననూ పక్కనపెట్టక తప్పదు.

యువతరం తలుపు తడుతోంది...
విజయ్‌ వయసు 34. ధావన్‌కు 32 దాటుతున్నాయి. వీరిద్దరిపై మరెంతో కాలం ఆధారపడలేం. ఇప్పటికే కొత్తవారిని పరీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మయాంక్‌ అగర్వాల్, పృథ్వీ షా తెరపైకి వస్తున్నారు. ఇటీవల జంటగా రాణిస్తున్నారు. వీరితోపాటు ప్రియాంక్‌ పాంచల్, ఫైజ్‌ ఫజల్, ఆర్‌.సమర్ధ్‌లు సైతం పరిశీలించదగినవారే. మరోవైపు దశాబ్ద కాలంలో భారత్‌ తరఫున టెస్టు ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే. వీరిలో అభినవ్‌ ముకుంద్‌ ఒక్కడే ప్రస్తుత జట్టులో లేడు. ధావన్, విజయ్‌... తర్వాత రాహుల్‌ ఆశలు రేకెత్తించడంతో మరొకరి గురించి ఆలోచన రాలేదు. ఇప్పుడు మాత్రం కొత్తవారిని పరీక్షించక తప్పదనేలా ఉంది. అందులోనూ ఎడమచేతి వాటం ఓపెనర్‌ అయితే మరీ ఉపయోగం. కానీ, దేశవాళీల్లో ఫైజ్‌ ఫజల్‌ మినహా మరో నాణ్యమైన ఆటగాడు కనిపించడం లేదు. అయితే, అతడికి 33 ఏళ్లు. ఈ కోణంలో చూస్తే 28 ఏళ్ల ముకుంద్‌కు అవకాశాలివ్వొచ్చు.

నేను రెడీ: రోహిత్‌
ముంబై: సంప్రదాయ ఫార్మాట్‌లోనూ ఓపెనింగ్‌కు సిద్ధం అంటున్నాడు వన్డే, టి20ల ఓపెనర్‌ రోహిత్‌శర్మ. టెస్టుల్లో విజయ్, ధావన్, రాహుల్‌ల వరుస వైఫల్యాలతో టీమిండియా సతమతం అవుతున్న వేళ తననూ పరీక్షించి చూడాలన్నట్లుగా మాట్లాడాడు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్‌... ‘నాకెప్పుడూ టెస్టుల్లో ఓపెనింగ్‌ చేసే అవకాశం రాలేదు. మేనేజ్‌మెంట్‌ కోరితే మాత్రం అందుకు సిద్ధం. దేశం తరఫున వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తానని ఎప్పు డూ ఊహించలేదు. అయినా అది అలా జరిగిపోయింది. టెస్టుల్లోనూ అవకాశం వస్తే కాదనేది లేదు. నిరూపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఆడాలనేది తన కోరికని... అయినా అది తన చేతుల్లో లేదని రోహిత్‌ వివరించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top